తీన్‌మార్‌ ఫైట్‌! | - | Sakshi
Sakshi News home page

తీన్‌మార్‌ ఫైట్‌!

Oct 27 2026 12:09 AM | Updated on Oct 27 2026 12:09 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: అధికార కాంగ్రెస్‌లో పదవుల లొల్లి అంతర్యుద్ధాన్ని తలపిస్తోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు ముఖ్య ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా మహబూబ్‌నగర్‌ నగరం, శివారు పరిసర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఆవిర్భవించిన మహబూబ్‌నగర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ప్రస్తుతం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ పీఠమే లక్ష్యంగా మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, దేవరకద్ర నేతల మధ్య వార్‌ తారాస్థాయికి చేరుకుంది. అంతేకాదు ముడా పరిధిలో ఆదాయ ప్రాతిపదికన నిధుల్లో వాటా డిమాండ్‌.. పలు నామినేటెడ్‌ పదవుల పందేరం పార్టీలో ముసలం రాజేసినట్లు తెలుస్తోంది.

చైర్మన్‌ గిరిపై గురి..

ముడా పరిధిలోకి మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, జడ్చర్ల మున్సిపాలిటీతో పాటు దేవరకద్ర నియోజకవర్గంలోని భూత్పూర్‌ మున్సిపాలిటీ వస్తాయి. మొత్తంగా 12 మండలాలల్లో 142 గ్రామాలు దీని కింద ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముడా చైర్మన్‌ గిరిపై జిల్లాలోని మూడు నియోజకవర్గాల ముఖ్యనేతల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం తొలుత మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన లక్ష్మణ్‌ యాదవ్‌ను ముడా చైర్మన్‌ గిరి వరించింది. ప్రస్తుతం ఆయన పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఈ క్రమంలో ఈ పీఠంపై మూడు నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆసక్తి చూపుతుండడం.. వారికి మద్దతుగా చైర్మన్‌ గిరిపై గురి పెట్టిన ముఖ్యనేతలు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తల పట్టుకున్న అధిష్టానం..

జిల్లాస్థాయి నామినేటెడ్‌ పోస్టులైన ముడాతో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవి త్వరలో ఖాళీ కానుంది. అదేవిధంగా మార్కెట్‌ కమిటీల పదవీ కాలం దగ్గరపడుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ ఈ నామినేటెడ్‌ పదవుల భర్తీ చేపట్టే అవకాశం ఉంది. ఓటు బ్యాంక్‌, సామాజిక సమీకరణాల వంటి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా ముడా, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవులపై మూడు నియోజకవర్గాల నేతలు ఎవరికీ వారు పంతం వీడకపోవడం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పదవుల్లో ఒక్కొక్కటి చొప్పున దేవరకద్ర, జడ్చర్లకు కేటాయించే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే జిల్లాకేంద్ర నియోజకవర్గాన్ని విస్మరిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని మహబూబ్‌నగర్‌ నేతలు స్పష్టం చేయడంతో పాటు చైర్మన్‌ గిరి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

తెరపైకి కొత్త పంచాయితీ..

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో పాటు వివిధ పథకాల ద్వారా ముడా పరిధిలో రహదారులు, తాగునీరు, జంక్షన్లు, డ్రెయినేజీలు, పార్కులు, వీధిదీపాల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిధుల వాటా డిమాండ్‌ తెరపైకి వచ్చింది. జడ్చర్ల ఎమ్మెల్యే ఇటీవల మాట్లాడుతూ ముడాకు ఆదాయం 90 శాతం మేర జడ్చర్ల నుంచే సమకూరుతోందని.. ఈ మేరకు నియోజకవర్గానికి 50 శాతం వాటాతో నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీంతో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. మరోవైపు ఒప్పందం ప్రకారం ముడా చైర్మన్‌ పదవిని రెండో పర్యాయం జడ్చర్ల నియోజకవర్గానికి కేటాయించారని.. ఈసారి వదులుకునే ప్రసక్తే లేదని అనిరుధ్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌తో పాటు జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన పలువురు ఆశావహులు తమతమ గాడ్ఫాదర్ల ద్వారా ముడా పీఠం దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత చైర్మన్‌ లక్ష్మణ్యాదవ్‌ సైతం రెండోసారి కూడా తనకే దక్కుతుందనే ఆశతో ఉన్నారు.

జీఎమ్మార్‌ ప్రకటనతో ముసలం..

తొలుత ఒప్పందం ప్రకారం తొలి పర్యాయం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి ముడా చైర్మన్‌ పదవి దక్కింది. పదవీకాలం పూర్తికాక మునుపే దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌ రెడ్డి ముడా చైర్మన్‌ పదవిని ఆ నియోజకవర్గానికి చెందిన నవీన్‌గౌడ్‌కు ఇస్తామని ప్రకటించారు. దీంతో ముసలం చెలరేగింది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వయంగా స్పందించడంతో విభేదాలు వెలుగు చూశాయి.

కాంగ్రెస్‌లో పదవుల లొల్లి

మూడు నియోజకవర్గాల

నేతల పంతం

ముడా చైర్మన్‌ పీఠం కేంద్రంగా పావులు

తెరపైకి ఆదాయ ప్రాతిపదికన నిధుల్లో వాటాకు డిమాండ్‌

జిల్లా గ్రంథాలయ, మార్కెట్‌ చైర్మన్‌గిరి పైనా ఆసక్తి

పాలమూరులో

రాజుకున్న రాజకీయ వేడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement