జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మండల ప్రత్యేక అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలపై సమీక్షించారు. బుధవారం మండలంలోని గ్రామాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలను తనిఖీ చేయడంతో పాటు, తమ శాఖలకు సంబంధించిన కార్యక్రమాల అమలు తీరును పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి అధికారి వారంలో కనీసం రెండు నుంచి మూడు గ్రామ పంచాయతీలను సందర్శించాలని, కేటాయించిన మండలాల్లోని గ్రామాలను ప్రతి నెలా క్రమం తప్పకుండా పర్యటించాలని సూచించారు. మండల కేంద్రంలోని గ్రామాలకే పరిమితం కాకుండా మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు.
వేసవిలో తాగునీటి
సమస్య రాకుండా చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో బోరుబావులు, చేతిపంపులు, నీటి సరఫరా వ్యవస్థలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, కుళాయిల పనితీరును పరిశీలించాలన్నారు. నీటి లీకేజీలు, వృథా ఉంటే వెంటనే అరికట్టాలని సూచించారు. రానున్న ఐదు నుంచి ఆరు నెలల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రణాళిక సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైనప్పుడు నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేయడం, వాటిని ఎక్కడ నింపాలి, ఏయే గ్రామాలకు సరఫరా చేయాలి, నీటిని ఎక్కడ నిల్వ చేయాలనే అంశాలపై ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
నీరు, విద్యుత్ వృథాను అరికట్టాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరం లేనప్పుడు విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ఏసీలను నిలిపివేయాలని కలెక్టర్ సూచించారు. నీరు, విద్యుత్ వృథాను అరికట్టడం ప్రతి అధికారి బాధ్యతగా భావించాలన్నారు. ఇదే విధానాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అమలు చేయాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేయాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా? పరిశుభ్రత పాటిస్తున్నారా? అనే విషయాలను పరిశీలించి, లోపాలుంటే వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ, డీఆర్‌ఓ నిర్మల, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఓటరు నమోదు
వేగవంతం చేయాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, సర్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6, 2026 కావడంతో రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారంతో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అందిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించాలన్నారు. విద్యార్హత ధ్రువపత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా, అదనపు కలెక్టర్లు మధుసూదన్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు.
ఎల్‌నినో పరిస్థితులపై సమీక్షించాలి: కలెక్టర్ ఖుష్బూగుప్తా


