● పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్..విద్యార్థులకు ఎస్పీ జానకి అవగాహన
మహబూబ్‌నగర్ క్రైం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సోమవారం మహబూబ్‌నగర్ పరేడ్ మైదానంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు విధులు, ఆయుధాలు, నేర పరిశోధన, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఎస్పీ డి.జానకి కార్యక్రమానికి హాజరై వివిధ పోలీసు విభాగాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. టీనేజర్లు సోషల్ మీడియాను అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చెడు మార్గాల వైపు వెళ్లకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుపై దృష్టి సారించాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఓపెన్ హౌస్‌లో ట్రాఫిక్ పోలీసు విభాగం, బాంబు డిస్పోజల్ బృందం, డాగ్ స్క్వాడ్, భరోసా కేంద్రం, షీ టీం, కమ్యూనికేషన్ విభాగం, ఫింగర్‌ప్రింట్ యూనిట్, క్లూస్ టీం, స్పీడ్‌గన్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, ఆయుధాలు, బుల్లెట్లు, డయల్ 112 విభాగాలను ప్రదర్శనకు ఉంచారు. నేరస్థలాల్లో ఆధారాల సేకరణ, వేలిముద్రల ఆధారంగా నేర పరిశోధన, బాంబు బెదిరింపుల సమయంలో ప్రత్యేక బృందాల స్పందన తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, ఇజాజుద్దీన్, ఆర్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


