మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యం పరిసర ప్రాంతంలోని వటువర్లపల్లి పునరావాసంపై గ్రామస్తులు వర్గాలుగా విడిపోయి తలో మాట మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం గ్రామంలో నెలకొన్న పరిస్థితుల మేరకు వివరాల్లోకి వెళ్తే.. అమ్రాబాద్ మండలం వటువర్లపల్లి గ్రామస్తులకు అటవీశాఖ కల్పిస్తున్న పునరావాసానికి కొన్ని కుటుంబాలు సిద్ధంగా ఉన్నప్పటికీ.. మరికొందరు గ్రామాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని అంటున్నారు. ఈ క్రమంలో పునరావాసం కోరుకుంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారితో గతనెల 18న అటవీశాఖ అధికారులు ఎంఓయూ చేసుకున్నారు. అప్పట్లో 237 కుటుంబాలు పునరావాసం కోరుకుంటున్నట్లు సంతకాలు చేయడం జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి అటవీశాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్తులను ఒక్కొక్కరిని కలుస్తూ, ఇకపై గ్రామంలో విద్యుత్, తాగునీటి సరఫరా సక్రమంగా ఉండదని.. ఈ ప్రాంతమంతా వన్యప్రాణులు సంచరించే విధంగా ఆవాసాలు పునరుద్ధరిస్తామని ఆందోళనకరమైన విషయాలు తెలియజేస్తున్నారని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇష్టం లేకున్నా బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఓ వర్గం వారు ఆరోపిస్తున్నారు. గ్రామానికి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు, సీసీరోడ్లు, పాఠశాల నూతన భవనం, ఆశ్రమ పాఠశాలకు ప్రహారీ, ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకు మరమ్మతు పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడే పుట్టి పెరిగిన ఆదివాసీ చెంచులు గ్రామాన్ని విడిచి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదంటున్నారు. ఇదిలా ఉంటే, మరో వర్గం (పునరావాసం కోరుకునే వారు) గ్రామంలో కనీస సౌకర్యాలు లేకపోగా.. తమ పిల్లలకు ఉన్నత చదువులు అందుబాటులో లేవని చెబుతున్నారు. ఉద్యోగ అవకాశాలు దక్కక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. సాగుచేసిన పంటలపై వన్యప్రాణులు దాడిచేసి తీవ్ర నష్టం కలిగిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. అటవీ సరిహద్దు ప్రాంతంలో ఇబ్బందులు పడుతూ ఉండలేకపోతున్నామని, అందుకే ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం బాకారం గ్రామ సమీపంలో కల్పిస్తున్న పునరావాసాన్ని కోరుకుంటున్నామని అంటున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పునరావాసంపై ఉన్న అపోహలను తొలగించాలని కోరుతున్నారు.


