బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేక చట్టం తేవాలి | - | Sakshi
Sakshi News home page

బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేక చట్టం తేవాలి

Oct 26 2026 2:46 AM | Updated on Oct 26 2026 2:46 AM

● జనాభా దామాషా ప్రకారం

నిధులు కేటాయించాలి

● బీసీ సమాజ్‌ రౌండ్‌టేబుల్‌

సమావేశంలో డిమాండ్‌

జెడ్పీ సెంటర్‌ (మహబూబ్‌నగర్‌): బీసీల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారత, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు బీసీ సబ్‌ప్లాన్‌పై ప్రత్యేక చట్టం తీసుకురావాలని బీసీ సమాజ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు డిమాండ్‌ చేశారు. ఆదివారం మెట్టుగడ్డ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సమాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు. రాష్ట్ర జనాభాలో బీసీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ, వారి అభివృద్ధికి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించేలా చట్టబద్ధమైన హామీ కల్పించాలని కోరారు. బీసీ జేఏసీ నాయకుడు బెక్కం జనార్దన్‌ మాట్లాడుతూ విద్య, వైద్యం, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత, వృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. వివిధ శాఖల్లో బీసీల కోసం కేటాయించిన నిధులు, వాటి వినియోగ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రత్యేక చట్టం రూపొందించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని సమావేశం డిమాండ్‌ చేసింది. బీసీలకు జనాభా దామాషా ప్రకారం నిధులు దక్కేలా అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో బీసీ సమాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్‌ సాగర్‌, గౌరవ అధ్యక్షుడు విజయకుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయరాజు, తెలంగాణ టీచర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జుర్రు నారాయణ, సారంగి లక్ష్మీకాంత్‌, బుగ్గన్న, మహేందర్‌, వెంకటేశ్‌ గౌడ్‌, నరసింహ, బానుప్రకాశ్‌, ప్రభాకర్‌, రాజ్‌కుమార్‌, ఆంజనేయులు, శ్రీకాంత్‌, శ్రీనివాసులు, పాండురంగం యాదవ్‌, పిల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement