అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
● జిల్లాలో 40 శాతం కూడా దాటని గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు
● నవంబర్ 6తో ముగియనున్న గడువు
● ఇప్పటివరకు 19,528 దరఖాస్తులు
జెడ్పీ సెంటర్ (మహబూబ్‌నగర్): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. అర్హులైన పట్టభద్రులు ఆశించిన స్థాయిలో దరఖాస్తు చేసుకోవడం లేదు. నమోదు గడువు నవంబర్ 6తో ముగియనుండగా, ఇప్పటి వరకు 19,528 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో అర్హులందరూ ఓటరుగా నమోదవుతారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. 2021 మార్చిలో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. త్వరలో ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనుండటంతో తదుపరి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని తొమ్మిది జిల్లాల పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గతంలో ఓటరుగా నమోదైన పట్టభద్రులు సైతం ఈసారి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అయినప్పటికీ నమోదు ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదు. మొత్తం దరఖాస్తుల్లో 19,525 ఆన్‌లైన్‌లో, 3 మాత్రమే జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో నమోదయ్యాయి.
అర్హులైన పట్టభద్రులంతా బాధ్యతగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఓటరుగా నమోదైన పట్టభద్రులతో పాటుమూడేళ్ల క్రితం డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు నమోదు చేయించుకోవాలి. ఇలాంటి సందేహాలు ఉన్నా తహసీల్దార్ కార్యాలయం లేదా స్థానిక బీఎల్‌ఓను సంప్రదించవచ్చు. – నవీన్, ఆర్డీఓ


