‘ఆదర్శ’ం.. బలోపేతం | - | Sakshi
Sakshi News home page

‘ఆదర్శ’ం.. బలోపేతం

Oct 25 2026 12:47 AM | Updated on Oct 25 2026 12:47 AM

అచ్చంపేట: ఆదర్శ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇక మీదట సీబీఎస్‌ఈ స్కూళ్లుగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. అలాగే 2027– 28 నుంచి ప్రీ ప్రైమరీతోపాటు ప్రాథమిక పాఠశాలలు కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. తద్వారా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తోంది. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2013లో మోడల్‌ స్కూళ్లను ఏర్పాటు చేసింది. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఆంగ్ల బోధన ఉన్నప్పటికీ రాష్ట్రస్థాయి సిలబస్‌లోనే ఉంది. ఉమ్మడి జిల్లాలోని వెల్దండ, కోడేరు, కొత్తకోట, పెబ్బేరు, ఖిల్లాఘనపురం, ధన్వాడ, కోస్గి, గండేడ్‌ మండలాల్లో ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇందులో సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని విద్యాశాఖ భావిస్తోంది.

విద్యార్థుల సంఖ్య పెంపు..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం 8 మోడల్‌ స్కూళ్లు ఉండగా.. 6 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. ఒక్కో పాఠశాలలో 820 విద్యార్థుల ప్రవేశానికి అవకాశం ఉంది. 5 నుంచి 10 తరగతి వరకు 500, ఇంటర్మీడియట్‌లో 320 విద్యార్థులు ప్రవేశం పొందవచ్చు. ప్రతి స్కూల్‌లో 100 విద్యార్థినులకు హాస్టల్‌ వసతి ఉంటుంది. అయితే కొన్నిచోట్ల పాఠశాలలు దూరంగా ఉండటం, రోజురోజుకూ గురుకులాలు, కేజీబీవీలు పెరుగుతుండటంతో మోడల్‌ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పోటీ పరీక్షలకు కోచింగ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జాతీయస్థాయి పోటీ పరీక్షల కోచింగ్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్‌ స్కూళ్లలో 29 యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 2026– 27 విద్యా సంవత్సరంలోనే దీనిని అమలు చేస్తామని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు. జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులకు ఐఐటీ– జేఈఈ, నీట్‌, క్లాట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 6మంది చొప్పున బోధనా సిబ్బందిని నియమిస్తారు. ఎంపికై న అధ్యాపకులు గంట ప్రాతిపదికన 152 పనిదినాలపాటు విద్యార్థులకు బోధించనున్నారు. కాన్సెప్ట్‌ ఆధారిత బోధన, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, సందేహాల నివృత్తి, అసైన్‌మెంట్లు, మాక్‌ టెస్టులు, వెనుకబడిన విద్యార్థులకు అదనపు సహాయం అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఈ నెల 14న నిధులు సైతం విడుదల చేసింది.

సీబీఎస్‌ఈ స్కూళ్లుగా మార్చేందుకురాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 8 మోడల్‌ స్కూళ్లు

ఒక్కో పాఠశాలలో 820 మందికి ప్రవేశం

ఈ ఏడాది నుంచి ఐఐటీ– జేఈఈ, నీట్‌ కోచింగ్‌

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement