సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

Oct 25 2026 12:47 AM | Updated on Oct 25 2026 12:47 AM

● వ్యక్తిగత సమాచారం భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్‌ ఖుష్బూగుప్తా

● పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు ఇతరులతో

పంచుకొవద్దు

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): సైబర్‌ మోసాలపై ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా సూచించారు. వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, జిల్లా పోలీసు శాఖ సంయుక్తంగా వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు సైబర్‌ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆధార్‌, పాన్‌కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. గుర్తు తెలియని లింకులను క్లిక్‌ చేయడం, నమ్మకం లేని యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయడం వంటివి చేయరాదన్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్‌ చేసి బెదిరించడం, డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేయడం వంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్‌ వస్తే సంబంధిత అధికారులను సంప్రదించి వాస్తవాలను నిర్ధారించుకోవాలన్నారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులకూ సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.

పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌తో అవగాహన

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, వీడియోల ద్వారా ఫేక్‌ లింకులు, ఓటీపీ మోసాలు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాలు, డిజిటల్‌ అరెస్ట్‌లు, సోషల్‌ మీడియా నేరాలపై అవగాహన కల్పించారు. పిల్లలు ఇన్‌స్ట్రాగామ్‌, స్నాప్‌చాట్‌ వంటి యాప్‌లు ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. చిన్నారులకు సంబంధించిన లైంగిక దోపిడీ చిత్రాలు, వీడియోలను వీక్షించడం, భద్రపరచడం, ఇతరులకు పంపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇటీవల తువ్వగడ్డ తండా ప్రాంతంలో సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సైబర్‌ నేరాల నివారణ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్‌ శివాని, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, డీఆర్వో నిర్మల, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ గిరికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి: ఎస్పీ

సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ డి.జానకి సూచించారు. సత్వర ఫిర్యాదుతో మోసగాళ్ల ఖాతాల్లోకి బదిలీ అయిన డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలన్నారు. మొబైల్‌, బ్యాంకింగ్‌ యాప్‌లు, సోషల్‌ మీడియా ఖాతాలకు బలమైన పాస్‌వర్డ్‌లు ఏర్పాటు చేసుకోవాలని, అపరిచితులు పంపే ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేయవద్దని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్‌ ప్రొఫైల్స్‌ సృష్టించి డబ్బులు అడిగితే, పంపే ముందు సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement