పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించాలి

Oct 25 2026 12:47 AM | Updated on Oct 25 2026 12:47 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: భూభారతితో పాటు మీ–సేవ ద్వారా అందిన, నాలా కన్వర్షన్‌, కోర్టు కేసులు, మ్యుటేషన్లకు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నుంచి మండల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా భూభారతి పెండింగ్‌ దరఖాస్తులు, గ్రామాల్లో రీ–సర్వే పనుల పురోగతి, భూదాన్‌ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియపై సమీక్షించారు. దరఖాస్తుదారులు ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నిర్ణీత సమయంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌, జడ్చర్ల, గండేడ్‌, నవాబుపేట, కౌకుంట్ల మండలాల్లో భూభారతి కింద ఎక్కువ సంఖ్యలో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె గుర్తించారు. అడ్డాకల్‌, మూసాపేట్‌, చిన్నచింతకుంట, గండీడ్‌, మహమ్మదాబాద్‌లో రీ–సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. ఈనెలాఖరు నాటికి ప్రతి గ్రామంలో కనీసం 300 ఎకరాలైనా రీ–సర్వే పూర్తి చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలంలో ఏర్పాటు చేసే ఇసుక బజార్‌ స్థలంపై ఏడీ మైనింగ్‌, ఆర్డీఓను సంప్రదించాలని తహసీల్దార్‌ ఘాన్సీరామ్‌కు సూచించారు.

చేనేత, జౌళి శాఖ ఏడీగా రంజిత్‌ బాధ్యతల స్వీకరణ

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీగా జె.రంజిత్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు శాఖ కమిషనర్‌ కార్యాలయంలో డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పిస్తూ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రంజిత్‌ మాట్లాడుతూ.. జిల్లాలో చేనేత కార్మికులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాలు చేరవేయడంతోపాటు చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ ఖుష్బూగుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాఖకు సంబంధించిన పరిపాలనా అంశాలు, పథకాల అమలు విషయాలను కలెక్టర్‌కు వివరించారు.

ఏఐసీసీ పరిశీలకుడిగా ఒబేదుల్లా కొత్వాల్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఓట్‌ బచావ్‌–దేశ్‌ బచావ్‌ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఏఐసీసీ పరిశీలకుడిగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని తూత్తుకుడి కార్పొరేషన్‌, తూత్తుకుడి సౌత్‌, నార్త్‌, కన్యాకుమారి ఈస్ట్‌, వెస్ట్‌, నాగర్‌కోయిల్‌ కార్పొరేషన్‌ జిల్లాల బాధ్యతలను ఏఐసీసీ ఆయనకు అప్పగించింది. ఈ ప్రాంతాల్లో ఓట్‌ బచావ్‌–దేశ్‌ బచావ్‌ ప్రచార కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షిస్తూ, స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement