నెరవేరనున్న ఆకాంక్ష | - | Sakshi
Sakshi News home page

నెరవేరనున్న ఆకాంక్ష

Oct 23 2026 12:33 AM | Updated on Oct 23 2026 12:33 AM

● జడ్చర్ల రెవెన్యూ డివిజన్‌ దిశగా అడుగులు

● ఊర్కొండ మినహా జడ్చర్ల నియోజకవర్గంలోని 5 మండలాలు

● మరో రెండు మండలాలతోకలిపి త్వరలోనే వెలువడనున్న ప్రకటన

● కావేరమ్మపేట పాత జీపీ భవనంలో కార్యాలయం ఏర్పాటు

జడ్చర్ల టౌన్‌: రెవెన్యూ డివిజన్‌ కోసం చిరకాలంగా ఎదురు చూస్తున్న జడ్చర్ల ప్రజల ఆకాంక్ష త్వరలోనే నెరవేరనుంది. జడ్చర్ల నియోజకవర్గంలోని 5మండలాలు (ఊర్కొండ మినహాయించి) దేవరకద్ర నియోజకవర్గంలోని రెండు మండలాలను కలుపుకొని త్వరలోనే రెవెన్యూ డివిజన్‌ ప్రకటించనున్నారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కావేరమ్మపేట పాత జీపీ భవనం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం కానుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

2016లో ఆశలు గల్లంతు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2016లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో ఉమ్మడి జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలు రెవెన్యూ డివిజన్లుగా మారాయి. జడ్చర్ల రెవెన్యూ డివిజన్‌ అవుతుందనుకున్నప్పటికీ ప్రజల ఆకాంక్షలు గల్లంతయ్యాయి. దీంతో రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి ఏర్పాటు చేసి దీక్షలు ప్రారంభించారు. దీక్షల సందర్భంగా రాష్ట్రంలో మరెక్కడైనా రెవెన్యూ డివిజన్‌ ప్రకటిస్తే తప్పక జడ్చర్ల అవుతుందని అప్పటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. కాగా 2019లోనూ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్‌ రెవెన్యూ డివిజన్‌గా మారినా జడ్చర్ల వాసులకు నిరాశే మిగిలింది.

ఎన్నికల హామీ

2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తాను గెలిచాక జడ్చర్లకు రెవెన్యూ డివిజన్‌ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయన గెలిచిన తొలినాళ్లలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రెవెన్యూ డివిజన్‌ చేయాలని విన్నవించారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రస్తావించారు. దాంతో ఇంతకుముందున్న కలెక్టర్‌ విజయేందిర బోయి రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ మరోసారి జడ్చర్ల ప్రజల ఆకాంక్షను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వినిపించారు. ఇటీవల వనపర్తిలో జరిగిన సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. దీంతో ఫైల్‌లో కదలిక మొదలయ్యింది.

ఇచ్చినహామీ మేరకే..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జడ్చర్ల రెవెన్యూ డివిజన్‌గా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీలో ప్రస్తావించా. ముఖ్యమంత్రిని కలసి విన్నవించా. రెవెన్యూ శాఖ మంత్రికి ఇటీవలే మరోసారి వినతిపత్రం సమర్పించా. గతంలోనే రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించాం. త్వరలోనే రెవెన్యూ డివిజన్‌ ప్రకటన వెలువడి జడ్చర్ల ప్రజల ఆకాంక్ష నెరవేరబోతుంది.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే జడ్చర్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement