కేటీదొడ్డి: విద్యుత్ షాక్‌కు గురై యువ రైతు మృతిచెందిన ఘటన కేటీదొడ్డి మండలకేంద్రంలో విషాదం నింపింది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డికి చెందిన పిల్లి వీరన్న (29) బుధవారం రాత్రి తన తండ్రి పిల్లి ఆంజనేయులుతో కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వ్యవసాయ మోటారుకు విద్యుత్ సరఫరా కాకపోవడంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద పరిశీలించేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వీరన్న అక్కడికక్కడే మృతిచెందాడు. వీరన్నకు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన యువ రైతు అకాల మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ హనుమంతు, మండల అధ్యక్షుడు ఉరుకుందు, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచులు రాజశేఖర్, నారాయణ గద్వాల ఆస్పత్రిలోని వీరన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి తండ్రి పిల్లి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెరువులో మునిగి
మేకల కాపరి మృతి
వెల్దండ: మండలంలోని గాన్‌గట్టుతండాకు చెందిన మేకల కాపరి కేతావత్ గన్యనాయక్(58) గురువారం ప్రమాదవశాత్తు చెరువులో నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గన్యనాయక్ రోజువారిగా మేకలను మేపేందుకు బొల్లంపల్లి పెద్ద చెరువు గుట్టకు తీసుకెళ్లాడు. మధ్యాహ్న సమయం కావడంతో తాగునీటికోసం బొల్లంపల్లి చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి చేపల కోసం వేసిన వలలో చిక్కుకున్నాడు. గమనించిన అతని భార్య పిక్లీ కేకలు వేస్తూ చుట్టుపక్కల రైతులను తీసుకొచ్చింది. అతనిని బయటకు తీసేలోపే అప్పటికే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ప్రాణం తీసిన అతివేగం
కల్వకుర్తి రూరల్: బైక్‌పై అతివేగంగా వెళ్తూ సూచిక బోర్డు ఢీకొని ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలైన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కురుమూర్తి వివరాల ప్రకారం చెరుకూరు గ్రామానికి చెందిన గోరటి వెంకటయ్య(47) కల్వకుర్తి మండలం తర్నికల్‌లో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సులో కల్వకుర్తికి చేరుకున్నాడు. పట్టణంలోని సమీప బంధువు అయిన దండు వెంకటయ్య బైక్ తీసుకొని ఇద్దరు తర్నికల్ గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో మున్సిపాలిటీ పరిధిలోని సంజాపూర్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోరటి వెంకటయ్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా గాయపడిన దండు వెంకటయ్యను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు విక్రమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు.


