నిన్న తల్లి.. నేడు తండ్రి.. అనాథలైన ముగ్గురు చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

నిన్న తల్లి.. నేడు తండ్రి.. అనాథలైన ముగ్గురు చిన్నారులు

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

● రోడ్డు ప్రమాదంలో గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు

● అమిస్తాపూర్‌లో హృదయవిదారక విషాదం

భూత్పూర్‌: నిన్నటి వరకు అమ్మానాన్నల ప్రేమానురాగాల మధ్య గడిపిన ఆ చిన్నారుల జీవితాల్లో ఒక్కసారిగా చీకట్లు అలుముకున్నాయి. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తొలుత తల్లి షహనా బేగం ప్రాణాలు కోల్పోగా.. తండ్రి ఎండీ షాకీర్‌ (45) కూడా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ముగ్గురు చిన్నారులు దిక్కులేనివారయ్యారు. వారి భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

రెప్పపాటులో ఛిద్రమైన కుటుంబం

భూత్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షహనా బేగం మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త షాకీర్‌ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి కుమార్తె ఆయారా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. టైలరింగ్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షాకీర్‌ దంపతులకు అవేజ్‌, అయేషా, ఆయారా ముగ్గురు సంతానం. అవేజ్‌ మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుండగా, మిగిలిన ఇద్దరు చిన్నారులు గ్రామంలోని పాఠశాలలో చదువుతున్నారు. పిల్లల చదువులు, వారి భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కన్నీటి సంద్రంలో అమిస్తాపూర్‌

తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారుల పరిస్థితి గ్రామస్తులను కలచివేస్తోంది. కష్టపడి పనిచేస్తూ పిల్లలను పెంచిన ఆ తండ్రి.. ప్రేమగా చూసుకున్న ఆ తల్లి ఇక లేరన్న నిజం ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలింది. చిన్నారుల చదువు, పోషణ, భవిష్యత్తు ఎలా అన్న ఆందోళన గ్రామంలో వ్యక్తమవుతోంది. ఈ ముగ్గురు పిల్లలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు ఆదుకొని అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

డివైడర్ల వద్ద ప్రమాదాలపై ఆందోళన

చించోలి–భూత్పూర్‌ జాతీయ రహదారి–167ఎన్‌పై అమిస్తాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్లలో పలుచోట్ల దారులు ఉండటంతో వాహనదారులు యూ టర్న్‌ తీసుకునే సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. డివైడర్ల వద్ద ఆరు చోట్ల దారులు ఉండటానికి బదులుగా, అవసరమైన రెండు చోట్ల మాత్రమే మార్గాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రహదారి భద్రతపై అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కేసు నమోదు..

నిందితుడి అరెస్టు..

అజాగ్రత్తతో అతివేగంగా థార్‌ కారు నడుపుతూ ఇద్దరు మృత్యువాతకు కారణమైన టీజీ 34 బీ, 7235 నంబరు గల వాహనాన్ని నడుపుతున్న నితిన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగన్న తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement