ఆత్మకూర్/అమరచింత/చిన్నచింతకుంట: అగ్రవర్ణాల ఆగడాలను అనచివేసేందుకు 80శాతమున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఏకమై మన ఓట్లను మనమే వేసుకుని అగ్రకుల పాలనను అంతం చేద్దామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. శుక్రవారం మరికల్ నుంచి బయలుదేరిన పాదయాత్ర చిన్నచింతకుంట మండలం ఉంధ్యాల మీదుగా ఆత్మకూర్‌కు చేరుకుంది. రాత్రి గాంధీచౌక్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. పోరాడిసాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలవారు కంపెనీలు, వ్యవసాయ, అడ్డాకూలీలుగా జీవనం సాగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు రెడ్ల ఓట్లు అవసరంలేదని వాళ్ల ఓట్లు వాళ్లే వేసుకోవాలని, మన ఓట్లు మనమే వేసుకుని రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని తీసుకొద్దామన్నారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని అందలం ఎక్కియాలంటే బీసీల రాజ్యం రావాలని మనరాజ్యం వచ్చాక నేతన్నకు చేతినిండా పని కల్పిస్తామన్నారు.
మల్లన్న పాదయాత్రలో గలాట
తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్ర అమరచింత పట్టణంలో ప్రవేశించగా.. మల్లన్నను కలిసిన ఇక్కడి యువకులు సెల్ఫీ కోసం పోటీపడుతుండగా మల్లన్న అనుచరులు యువకులను తోసేయడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఒకానోక దశలో మాటల యుద్ధం తీవ్రతరమైంది. బీసీ నాయకుడంటూ బీసీ రాజ్యాధికారం అంటూ పాదయాత్రగా వచ్చిన మల్లన్నను బీసీ యువకులు కలవకూడదా అంటూ గొడవ పడ్డారు. తీరా పరిస్థితి కొట్టుకునేందుకు దారితీసింది. దీంతో ఇక్కడ జరుగాల్సిన కార్నల్ మీటింగ్‌ను రద్దు చేసుకుని పాదయాత్రగా ఆత్మకూర్‌కు బయలుదేరారు.


