● జక్లేర్‌లో మహిళ దారుణ హత్య
● మృతురాలి భర్తపై అనుమానాలు
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ రాంలాల్
మక్తల్: మండలంలోని జక్లేర్ శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.. మక్తల్ మండలం గుడిగండ్లకు చెందిన లక్ష్మణ్, యశోద (40) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మణ్ ఆటో నడుపుకొని, యశోద ఊరూరా ముగ్గు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే బుధవారం ఇద్దరు తమ పనులు చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లారు. ఈ క్రమంలో జక్లేర్ శివారులో యశోద హత్యకు గురైంది. ఆమె తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం సమీప వ్యవసాయ పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి మక్తల్ సీఐ రాంలాల్, ఎస్‌ఐలు రేవతి, అశోక్‌బాబు చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ మార్చురీకి తరలించారు. కాగా, మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె భర్తపై అనుమానాలు వ్యక్తం చేశారు. భార్యాభర్త మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే హతమార్చి ఉంటాడని మృతురాలి సోదరుడు కాశీనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతడు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ రాంలాల్ తెలిపారు.


