మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో జంగిల్ సఫారీ 3 నెలల విరామం తర్వాత ఎఫ్‌డీఓ ప్రకాష్ సింఘాల్ గురువారం పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీఓ మాట్లాడుతూ.. పర్యాటకులకు ప్రకృతిని దగ్గరికి చేర్చడంతో పాటు వివిధ జంతువులను సమీపం నుంచి తిలకించేందుకు అవకాశం అందించడం కోసమే నల్లమల అభయారణ్యంలో జంగిల్ సఫారీ నిర్వహిస్తున్నామన్నారు. అటవీ ప్రాంతంలో శాఖాహార వన్య ప్రాణులతో పాటు పెద్ద పులులు, చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. ఈ క్రమంలో సఫారీ వాహనంలో ప్రయాణిస్తున్న పర్యాటకులకు, ప్రకృతి, జంతు ప్రియులకు పెద్దపులి అనేక సార్లు కనిపించినట్లు తెలిపారు. అదే క్రమంలో ప్రకృతి సౌందర్యమైన ప్రదేశాలు, రకరకాల వృక్షాలు, పక్షులు దర్శనమిస్తాయని, అలాంటి దృశ్యాలను వీక్షిస్తూ మంచి అనుభూతిని పొందాలని సూచించారు. పర్యాటకులు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అభయారణ్యం పరిసరాల్లో పారవేయొద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు సవిత, వీరేష్, ఎఫ్‌ఎస్‌ఓలు బాబలి, హన్మంతు ఎఫ్‌బీఓలు, వాచర్లు పాల్గొన్నారు.


