మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం మలుపు తిరిగింది. అధికారులు ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను పాటించని 40 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నిర్దేశిత గడువులోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులకు ఉపాధ్యాయులు ఇచ్చే సమాధానాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇటీవల ‘ఆదేశాలిచ్చారు.. వదిలేశారు’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చేపట్టిన సర్దుబాటులో భాగంగా పలువురికి ఇతర పాఠశాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే 50 మంది వరకు ఉత్తర్వులు పాటించలేదని అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మొదటి దశలో 40 మందికి నోటీసులు జారీ చేశారు. కొంతమందికి బుధవారం, మరికొందరికి గురువారం నోటీసులు అందజేశారు.
సమాధానాల ఆధారంగా చర్యలు
బదిలీ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఎందుకు విధుల్లో చేరలేదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వారి సమాధానాలను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఈఓ విజయకుమారి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగినట్లు తేలితే సంబంధిత ఎంఈఓలకు కూడా నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఉపాధ్యాయుల సర్దుబాటులో నిబంధనలు పాటించలేదని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. జీఓ నంబర్ 25లోని నిబంధనలకు విరుద్ధంగా, విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా అవసరం లేని పాఠశాలలకు కూడా ఉపాధ్యాయులను బదిలీ చేశారని చెబుతున్నారు. కొందరిని మండలాలు దాటి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొందరికి మినహాయింపులెందుకు?
బదిలీ ఉత్తర్వుల అమలులోనూ సమానత్వం పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరికి మినహాయింపులు ఇచ్చి, మరికొందరిని మాత్రమే ఉత్తర్వుల ప్రకారం పంపించారని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. రాజకీయ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల పలుకుబడి ఉన్నవారికి మినహాయింపులు లభించగా.. ఇతరులు మాత్రమే బదిలీ అయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో.. బదిలీలకు సంబంధించి ఎంఈఓల స్థాయిలో నిబంధనలు పాటించారా? ఎక్కడెక్కడ అవసరం మేరకు సర్దుబాట్లు జరిగాయి? ఎక్కడైనా మినహాయింపులు ఇచ్చారా? అనే అంశాలపై అధికారులు తీసుకునే తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది.
‘సాక్షి’ కథనానికి స్పందించిన విద్యాశాఖ అధికారులు
బదిలీ ఉత్తర్వులు పాటించని ఉపాధ్యాయులకు షోకాజ్
ఎంఈఓల పాత్రపైనా విచారణకుఅవకాశం?


