గ్రామసభలతో ప్లాట్ల కేటాయింపు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

గ్రామసభలతో ప్లాట్ల కేటాయింపు వేగవంతం

Oct 2 2026 12:46 AM | Updated on Oct 2 2026 12:46 AM

● 15 రోజుల్లో పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు: కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఉదండపూర్‌ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌ లేఅవుట్లలో కేటాయించిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికి వీలుగా సర్పంచులు వెంటనే గ్రామసభలు నిర్వహించి ప్లాట్ల కేటాయింపు, ఇతర అవసరమైన తీర్మానాలు చేయాలని సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యలపై ఆమె సమీక్ష నిర్వహించారు. గ్రామసభల తేదీ, వేదికను సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో చర్చించి త్వరగా ఖరారు చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఫిర్యాదులను క్రమబద్ధంగా స్వీకరించి ప్రతి దరఖాస్తుపై లిఖితపూర్వకంగా స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. అర్హత లేని దరఖాస్తులను తిరస్కరిస్తే కారణాలను, అర్హత ఉన్న వాటిని ఆమోదిస్తే సంబంధిత వివరాలను తెలియజేయాలన్నారు. ఉదండపూర్‌, వల్లూరు, పోలేపల్లి, ఒంటి గుడిసె, శామగడ్డ తండా, చిన్నగుట్ట తండా, తుమ్మలగుట్ట తండా, రేగడిపట్టి తండాల్లో నిర్వాసితులను గుర్తించి భూ పరిహారం అవార్డులు జారీ చేసినట్లు అధికారులు వివరించారు. ఇళ్లను గుర్తించి నోటిఫై చేసి అవార్డులు జారీ చేయడంతో పాటు దాదాపు అన్ని పరిహారాలు చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 99 శాతం భూసేకరణ అవార్డులు పూర్తయ్యాయని, భూసేకరణ, ఇళ్ల ప్యాకేజీ, ఇళ్ల స్థలాలకు సంబంధించిన మొత్తాలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన ఒక శాతం కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రతి 15 రోజులకు ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు సమావేశమై పెండింగ్‌ సమస్యలను సమీక్షిస్తారని చెప్పారు. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్‌, పారిశుద్ధ్యం, శ్మశానవాటిక, ఖబరస్తాన్‌ తదితర మౌలిక వసతుల అవసరాలను ముందుగానే గుర్తించి చర్యలు చేపట్టాలని సూచించారు.

15 రోజుల్లో పరిష్కారానికి కృషి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్‌అండ్‌ఆర్‌ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. సర్పంచులు త్వరగా గ్రామసభలు నిర్వహించి, వచ్చే 15 రోజుల్లో పెండింగ్‌ అంశాలను సాధ్యమైనంత వరకు పరిష్కరించాలని కోరారు. ప్లాట్ల కేటాయింపు, పెండింగ్‌ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఖబరస్తాన్‌, శ్మశానవాటిక, ఫంక్షన్‌ హాళ్లు, రహదారులు వంటి మౌలిక వసతులపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపుపై కూడా చర్యలు కొనసాగుతున్నాయని, త్వరలో ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement