మహబూబ్‌నగర్ రూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం కల్పించకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానా లకు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించిందని పేర్కొన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న నామినేటెడ్ పోస్టులతోపాటు చట్టబద్ధమైన మెజారిటీ పదవులను కూడా సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇదేనా సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను పునః పరిశీలించి బీసీలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడొద్దని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ శ్రేణులు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, నాయకులు దామోదర్, కురుమూర్తి, శ్రీనివాస్, సాత్విక్, నరేందర్, అశోక్, అనిల్, జశ్వంత్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


