మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అకాడమిక్ రికార్డులను ఎప్పటికప్పుడు యూనివర్సిటీకి సమర్పించాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌తో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీచింగ్ డైరీలు క్రమం తప్పుకుండా నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు అకాడమిక్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల అభివృదికధ అవసరమైన చర్యలు చేపట్టాలని, అకాడమిక్ ప్రమాణాలపై మరింత మెరుగుపర్చాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు చంద్రకిరణ్, భూమయ్యపాల్గొన్నారు.
2న జిల్లా అథ్లెటిక్స్
క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: సదాశివపేటలోని కామ్‌కోలేలోని వొక్సేన్ యూనివర్సిటీలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో జరిగే జాతీయస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను 2వ తేదీన మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అండర్–14లోపు బాలబాలికలు 17.11.2012 నుంచి 16.11.2014 మధ్య, 16 ఏళ్లలోపు బాలబాలికలు 17.11.2010 నుంచి 16.11.2012 మధ్య పుట్టి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజనల్ ఎస్‌ఎస్‌సీ మెమో, జనన, కులధ్రువపత్రాలతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. మిగతా వివరాల కోసం 98497 06360, 94406 56162, 94921 77535 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
జాతీయస్థాయిలో
పతకాలు సాధించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: జాతీయస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటి పతకాలు సాధించాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో మంగళవారం జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు రిత్విక్‌రెడ్డి (8–10 ఏళ్ల విభాగం), దౌసిక్ ప్రసాద్ (10–12 ఏళ్ల విభాగం), ఎం.శివతేజ (14–16 ఏళ్ల విభాగం), సీహెచ్ అఖిల్ (16–18 ఏళ్ల విభాగం)లకు మ్యాట్‌లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాకు మంచి గుర్తింపు ఉందని, మీరు జాతీయస్థాయిలో పతకాలు సాధించి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. యోగా సంఘం ప్రధాన కార్యదర్శి టి.చంద్రశేఖర్ మాట్లాడు తూ అక్టోబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాజస్తాన్‌లో జాతీయస్థాయి యోగా పోటీలు జరుగుతాయని తెలిపారు. చెన్న వీరయ్య, జిల్లా యువజన, క్రీడలశాఖ అథ్లెటిక్స్ కోచ్ సునీల్‌కుమార్, బాల్‌రాజు పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్‌లో
తగ్గుతున్న నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకూ స్వల్పంగా తగ్గుతోంది. మంగళవారం నాటికి 21.6 అడుగులకు చేరింది. ఐదు రోజుల క్రితం 21.9 అడుగుల నీరు ఉండగా.. ప్రస్తుతం 0.3 అడుగులు తగ్గింది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు ఇటీవల కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు నీటిని విడుదల చేశారు. దీంతో జూరాల వద్ద కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం కింద ఉండ్యాల ఫేజ్–1 నుంచి రెండు పంపులను నడిపిస్తున్నారు. ఒక పంపు ద్వారా ఉండ్యాల, ఫర్దీపూర్, మరికల్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తుండగా.. మరో పంపు ద్వారా మరికల్ ఫేజ్–2 నుంచి కోయిల్‌సాగర్‌కు నీటిని తరలిస్తున్నారు. ఒకవైపు ప్రాజెక్టులోకి జూరాల నీరు చేరుతుండగా.. మరో వైపు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వస్తున్న నీటి కంటే విడుదల ఎక్కువగా ఉండటంతో నీటిమట్టం క్రమంగా పడిపోతోంది.


