మహబూబ్‌నగర్ క్రైం: మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే మహిళ బాధితులు, బాలికలతో అధికారులు, సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ డి.జానకి ఆదేశించారు. నగరంలో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్‌ను సోమవారం ఎస్పీ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. మొదట విధులు నిర్వహిస్తున్న ఒక్కో సిబ్బందితో మాట్లాడుతూ వారి బాధ్యతలు, విధుల పై ఆరా తీశారు. ఆ తర్వాత స్టేషన్‌లో పిటిషన్ మేనేజ్‌మెంట్ ప్రక్రియ, ఫిర్యాదుల నమోదు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, ఆన్‌లైన్ పిటిషన్ల నమోదు పరిశీలించారు. అదేవిధంగా పలు కేసుల రికార్డులు, స్టేషన్ డైరీ, ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు రికార్డులు, పిటిషన్ రిజిస్టర్, కోర్టు కేసులకు సంబంధించిన రికార్డులు, అరెస్టులు, బెయిల్స్‌కు సంబంధించిన వాటిని తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన కేసు ల్లో బాధితురాలి గోప్యత పాటించడం చాలా కీలకమని, వ్యక్తిగత వివరాలను అనవసరంగా బయటకు వెల్లడించరాదన్నారు. అవసరమైనప్పుడు కౌన్సెలింగ్, ఇతర సహాయక చర్యలు అందించాలన్నారు. మహిళలు, బాలికలపై నేరాలు జరిగిన కేసుల్లో దర్యాప్తు నిబంధనల ప్రకారం వేగంగా పూర్తి చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో నాణ్యత మరింత పెరగాల్సిన అవసరం ఉందని, బాధితులకు సత్వర అందేలా పని చేయాలన్నారు. తనిఖీల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఉమెన్ పీఎస్ సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐలు కృష్ణంరాజు, శైలజ పాల్గొన్నారు.
రేపు ఉద్యోగ మేళా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని శ్రీ విజయ ఫర్టిలైజర్స్, అమరరాజా బ్యాటరీ, అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 70 పోస్టు భర్తీ కి ఈనెల 30న తమ కార్యాలయంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికా రి మైత్రిప్రియ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీ–ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బయో–డేటాతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్ 89193 80410లో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
రేపు క్రీడాకారుల ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: డీఈఓ ఆదేశాల మేరకు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో ఈనెల 30వ తేదీన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14, 17 విభాగాల బాలబాలికల హ్యాండ్‌బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ బోనఫైడ్, ఆధార్‌కార్డుతో ఉదయం 9.30 గంటలకు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా అండర్–14, 17, 19 విభాగాల బాలబాలికల బాక్సింగ్ ఎంపికలను ఈనెల 30వ తేదీన ఉదయం 8.30 గంటలకు మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు బోనఫైడ్, ఆధార్‌కార్డు, ఇంటర్ విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మెమోతో హాజరుకావాలని కోరారు.
నేడు ఫుట్‌బాల్ ఎంపికలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, అండర్–17 విభాగాల బాల బాలికల ఫుట్‌బాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.


