ధరూరు: జూరాల ప్రాజెక్టు వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. వానకాలంలో పంటలుసాగు చేసుకున్న రైతులు తమ పంట పొలాలకు నీళ్లు వదలకుండా చేయడంతో పంటలు ఎండుముఖం పడుతుండడంతో కడుపు మండిన రైతులు రెండు రోజులుగా కుడి, ఎడమ కాల్వల వద్ద ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. శనివారం అర్ధరాత్రి కుడికాల్వ వద్ద నీళ్లు వదులుకునే ప్రయత్నం చేయడంతో అది గమనించిన పీజేపీ అధికారులు ఆదివారం పోలీసులకు సమాచారం అందించడంతో ధరూరు ఎస్‌ఐ నందికర్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రధాన కుడి కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద రాత్రి వరకు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కాల్వలకు నీటివిడుదల నిలిపివేయడంతో ప్రాజెక్టు వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పీజేపీ ఉన్నతాధికారులు శుక్రవారం సాగునీటి విడుదలపై స్పష్టత ఇవ్వలేదు. 24గంటల తర్వాత ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పిన విషయం తెలిసిందే. ఆదివారం సెలవు దినం కావడంతో రైతులు సోమవారం అధికారుల నుంచి వచ్చే సమాధానంపై ఎలాంటి స్పష్టత వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.


