● పీయూలో లా విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమంలో జిల్లా జడ్జి ప్రేమలత
● సదుపాయాల కల్పనకు కృషి: వీసీ శ్రీనివాస్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: దేశ స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన గొప్ప నాయకులంతా న్యాయవాదులే అని జిల్లా జడ్జి ప్రేమలత గుర్తుచేశారు. పీయూలో లా కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. న్యాయ విద్యకు అధిక ప్రధాన్యత ఉందని, విద్యార్థులు సబ్జెక్టులపై పట్టు సాధిచాలన్నారు. లీగల్ ఎయిడ్ క్లీనిక్‌ల ద్వారా పేద, పీడిత వర్గాలకు న్యాయ సహాయం అందించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వలస కార్మికులు, సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేందుకు ఆస్కారం ఉందని తెలిపారు. విద్యార్థులు సివిల్, క్రిమినల్, ప్రమాద కేసులపై అవగాహన పెంచుకోవాలన్నారు. కేసుల డ్రాఫ్టింట్, వాదనలు, భాషా విధానంపై పట్టు సాధించే విధంగా సాధన చేయాలని, సుప్రీం కోర్టు తీర్పులను ప్రతి రోజు చదవడం వల్ల న్యాయ విద్య సులువుగా అర్థం అవుతుందన్నారు.
వాస్తవాలను అర్థం చేసుకునేలా..
న్యాయ విద్య కేవలం పుస్తకాలు, చట్టాలకే పరిమితం కాకుండా సమాజంలో వాస్తవాలను అర్థం చేసుకునేలా ఉండాలని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. లా కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో ఉన్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ప్రాక్టికల్ అంశాలను దృష్టిలో ఉంచుకుని మాక్ కోర్టులు, లీగల్ ఏయిడ్‌లు, సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్‌సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, లా డీన్ వెంకటేశ్వర్లు, బీఓఎస్ చైర్మన్ రాంప్రసాద్, ప్రిన్సిపాల్ భూమయ్య, కరుణాకర్‌రెడ్డి, న్యాయవాదులు రవికుమార్, సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


