కూలిన వందేళ్లనాటి పాఠశాల భవనం | - | Sakshi
Sakshi News home page

కూలిన వందేళ్లనాటి పాఠశాల భవనం

Sep 20 2026 1:03 AM | Updated on Sep 20 2026 1:03 AM

పాఠశాల సమయం కాకపోవడంతో తప్పిన ప్రమాదం

ఇదే నమూనాతో కొత్తది నిర్మించాలని, గ్రామస్తులు, పూర్వవిద్యార్థులు విన్నపం

లింగాల: మండల కేంద్రంలో వందేళ్ల క్రితం నిర్మించిన జెడ్పీ ఉన్నత పాఠశాల కార్యాలయ సముదాయ భవనంలోని నైరుతి భాగం శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కూలిపోయింది. షెటిల్‌మెంట్‌ కాలంలో 1927 కన్న ముందు ఈ భవనాన్ని నిర్మించారు. అప్పట్లో దీనిని ఎస్పీ కార్యాలయంగా వాడుకలో ఉండేది. కాలక్రమేణా షెటిల్‌మెంట్‌ రద్దు కావడంతో ఈ భవనాన్ని ఉన్నత పాఠశాలగా మార్పు చేశారు. కాగా ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో కొన్నేళ్ల నుంచి వాడుకలో లేకపోవడంతో నిర్వహణ లేక అలాగే వదిలేశారు. దీనిని మమ్మతు చేయించాలని స్థానికులు కోరినప్పటికీ పరిశీలించిన ఇంజినీరింగ్‌ అధికారులు ఇది పూర్తిగా పనికిరాదని, కూల్చి వేయాలని సూచించారు. ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే భవనం అకస్మాత్తుగా కూలి పోయింది. కాగా.. పాఠశాల సమయం కాకపోవడంతో ఎలాంటి నష్టం జరుగలేదని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఉదయం నిర్వహించే ప్రార్థనను ఈ భవనం ఎదుటే నిర్వహించేవారు. ఇకనుంచి వెనుక భాగంలో ఉన్న భవనం ఎదుట ప్రార్థన నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు. భవనాన్ని తహసీల్దార్‌ వెంకటేష్‌, ఎంఈఓ బషీర్‌ అహ్మద్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు బుడ్డయ్య, పాఠశాల కమిటీ చైర్మన్‌ మంగమ్మ పరిశీలించారు. భవనం కూలిన విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంఈఓ తెలిపారు. భవనాన్ని పూర్తిగా కూల్చి వేసి ఇలాంటి నమూనాతో కొత్త భవనాన్ని నిర్మించాలని, గ్రామస్తులు, పాఠశాల పూర్వవిద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement