కందనూలు: జిల్లా కేంద్రంలోని బస్సు డిపో సమీపంలో శనివారం తాండూర్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు, నాగర్ కర్నూల్ వస్తున్న ఇసుక టిప్పర్ ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెంకటయ్య కాలు విరిగి తీవ్రగాయాలు కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉండగా ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపీరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల పరిస్థితిపై ఆరా తీసి ప్రయాణికుల్లో ఎవరికై నా గాయాలయ్యాయా అనే వివరాలను అక్కడున్న అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదం కారణంగా రహదారిపై ఏర్పడిన పరిస్థితులను కలెక్టర్ పరిశీలించి, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


