● ఉమ్మడి జిల్లాకు రూ.1.59 కోట్లు
● ఒక్కో ఎమ్మార్సీకి
రూ.90 వేల చొప్పున కేటాయింపు
● పర్యవేక్షణ మరింత పటిష్టం
చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు
నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్‌ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఎంఈలు, క్లస్టర్ జీహెచ్‌ఎంల పర్యవేక్షణ..
పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్‌ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్‌కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నాయి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది.
నిధుల వినియోగం ఇలా..
రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రిక ల ఖర్చులకు ఈ నిఽ దులను వెచ్చించనున్నారు. నిర్వహణ కు రూ.20 వేలు, టీ ఎల్‌ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్‌చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది.
విద్యా ప్రమాణాల పెంపునకు..
పాఠశాల విద్యాశాఖ ద్వారా మండల విద్యాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు పాఠశాలల పర్యవేక్షణ, విద్యా ప్రమాణాల మెరుగునకు కృషిచేస్తారు. విద్యా పర్యవేక్షణ (బోధన పద్ధతులను పరిశీలించడం), పరిపాలనా బాధ్యతలు (ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్లు, సెలవులు, జీతాలు బిల్లులు పర్యవేక్షించడం), ప్రభుత్వ పథకాల అమలు (మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ), నాణ్యత ప్రమాణాలు (విద్యార్థుల్లో అ భ్యాసన సామర్థ్యాలు మెరుగుపర్చేలా ప్రత్యేక ప్రణాళికలు రచించి నిర్వహించడం) వంటివి ఈ రెండు వ్యవస్ధల ద్వారా పరస్పరం సహకరించుకుంటూ విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.


