కురుమూర్తిలో ఘనంగా పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తిలో ఘనంగా పవిత్రోత్సవాలు

Aug 29 2026 1:10 AM | Updated on Aug 29 2026 1:10 AM

చిన్నచింతకుంట: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మాపురంలోని కురుమూర్తిస్వామి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ బ్రాహ్మణులు యజ్ఞ మండపంలో స్వామివారికి, అమ్మవారికి బ్రహ్మకలశం, అష్టోత్తర శతనామార్చన, కలశాభిషేకం తదితర పూజలను వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. అనంతరం పవిత్రారోపణ కార్యక్రమంలో భాగంగా పవిత్ర మాలలను ఆలయ చైర్మన్‌ బత్తుల బాలు యజ్ఞ మండపం నుంచి ప్రధాన ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారు, అమ్మవారు, ఆళ్వార్లు, ఉత్సవమూర్తులు, ద్వారపాలకులు, గరుడవాహనం, ధ్వజస్తంభం, బలిపీఠానికి పవిత్ర మాలలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కల్యాణం.. కమనీయం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రతి పౌర్ణమికి నిర్వహించే ఈ వేడుకను భక్తుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన శేషవాహనంపై స్వామిదంపతులను గర్భగుడి నుంచి కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ సాగిన ఈ వేడుక భక్తులను ఆకట్టుకుంది. అనంతరం ప్రత్యేక పూజలతో కల్యాణ క్రతువును ప్రారంభించారు. జీలకర్ర–బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమాలను అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కల్యాణ వేడుకను భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం స్వామిదంపతులను పల్లకిలో గర్భగుడికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలు, ఆభరణాలతో అలంకరించిన స్వామిదంపతులు భక్తులకు దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

నేషనల్‌ ఫుట్‌బాల్‌

పోటీలకు రోహిత్‌

మహబూబ్‌నగర్‌ క్రీడలు: కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లో జరగనున్న జాతీయస్థాయి జూనియర్‌ ఫుట్‌బాల్‌ బీసీ రాయ్‌ ట్రోఫీలో జిల్లాకు చెందిన రోహిత్‌ మేఘావత్‌ ఎంపికై నట్లు జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్‌పీ వెంకటేశ్‌, భానుకిరణ్‌ తెలిపారు. 20 రోజులుగా హైదరాబాద్‌లో నిర్వహించిన సన్నాహక శిబిరంలో జిల్లా క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. జాతీయ పోటీలకు క్రీడాకారుడి ఎంపికపై జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

నిలిచిన విద్యుదుత్పత్తి

ఆత్మకూర్‌: జూరాలప్రాజెక్టుకు వరద లేకపో వడంతో దిగువ, ఎగువ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్‌ శుక్రవారం తెలిపారు. ఇదివరకు ఎగువన 92.876 మి.యూ., దిగువన 77.601 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు వివరించారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 170.477 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు.

శ్రీశైలంలో 873.4 అడుగుల నీటిమట్టం

అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.40 అడుగుల వద్ద 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 8వేలు, కేఎల్‌ఐకి 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement