మహబూబ్‌నగర్ క్రైం: ఈనెల 30న జరిగే నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. గురువారం జేపీఎన్‌సీఈ, ఫాతిమా విద్యాలయ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి అధికారులతో భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్ 163 అమలు చేయాలని, 200 మీటర్ల పరిధిలో జిరాక్స్, ప్రింటింగ్, ఆన్‌లైన్, మీ–సేవా కేంద్రాలను మూసివేయించాలని ఆదేశించారు. అభ్యర్థులు, సిబ్బంది మినహా ఇతరులను అనుమతించరాదని, ఎలక్ట్రానిక్ పరికరాల నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జైలు భద్రతపై ఎస్పీ తనిఖీ
ఇటీవల ఖైదీ పరారీ నేపథ్యంలో జిల్లా జైలును ఎస్పీ డి.జానకి గురువారం తనిఖీ చేశారు. జైలు సూపరింటెండెంట్ కాళిదాస్‌తో కలిసి ప్రహరీ, ఇనుప కంచె, భద్రతా పాయింట్లను పరిశీలించారు. ఖైదీల భద్రతపై 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, పోలీస్, జైలుశాఖలు సమన్వయంతో భద్రత ను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు.


