● ‘అంతులేని కథ’ సినిమాలో..
ప్రముఖ నటుడు, నిర్మాత జీవీ నారాయణ
రావు(73) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు బాల్యం, విద్యాభ్యాసం గుంతకల్లులో సాగింది. చిన్నతనం నుంచే నాటకాలు, నటనంటే ఆయనకు మక్కువ.. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. విద్యార్థి దశలోనే ‘మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాప రుద్రీయం, మంచుతెర’ వంటి పలు నాటకాలు వేసి, తనదైన నటనతో మెప్పించారాయన. కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల వంటి పలువురితో కలిసి రంగస్థల వేదికను పంచుకున్నారాయన. వారి మధ్య మంచి స్నేహం కూడా ఉంది.
‘అంతులేని కథ’తో పరిచయం
నటనపై ఆసక్తితో మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు నారాయణరావు. ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తెరకెక్కించిన ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రజనీకాంత్, జయప్రద, శ్రీప్రియ, ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1976 ఫిబ్రవరి 27న విడుదలై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ‘వికటకవి గోపాల్’ పాత్రలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నారాయణ రావు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ప్రత్యేకించి ఈ సినిమాలో ‘తాళికట్టు శుభవేళ... మెడలో కళ్యాణ మాల...’ పాటలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘ముత్యాల పల్లకి, ఒక ఊరి కథ, చిలకమ్మ చెప్పింది, ఆలు మగలు, గుప్పెడు మనసు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, బడాయి బసవయ్య, ఊరుకిచ్చిన మాట, చట్టానికి కళ్ళు లేవు, మంచు పల్లకి, ప్రళయ రుద్రుడు, బహుదూరపు బాటసారి, దేవాంతకుడు, ప్రేమాయణం, యముడికి మొగుడు, ముత్యమంత ముద్దు, రాజా విక్రమార్క, సీతారామయ్యగారి మనవరాలు, గ్యాంగ్ లీడర్, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం, హిట్లర్, సాహసం, మహా భక్త సిరియాళ, రాజుగారి గది 2, తోలు బొమ్మలాట’ వంటి సుమారు 100కు పైగా చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు నారాయణ రావు. తెలుగులో ఆయన నటించిన చివరి చిత్రం ‘స్కైలాబ్’. 2021 డిసెంబరు 4న ఈ మూవీ విడుదలైంది.
నిర్మాతగానూ...
నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ నారాయణరావుకి మంచి అనుభవం ఉంది. నిర్మాతగా ‘యముడికి మొగుడు, దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, పెళ్ళి నీకు శుభం నాకు’ వంటి సినిమాలను నిర్మించారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు ఆయనకు రజనీకాంత్‌తో మంచి స్నేహం కుదిరింది. రజనీకాంత్, చిరంజీవితో ఆయనకు సన్నిహిత స్నేహం ఉంది. చిరంజీవి హీరోగా ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలు నిర్మించారు. ‘యముడికి మొగుడు’ సినిమాని తన మిత్రుడు రజనీకాంత్‌తో తమిళంలోనూ రీమేక్ చేశారు.
బుల్లి తెరపైనా...
‘పసుపు కుంకుమ, సుందరకాండ, గిరిజా కళ్యాణం, గీతాంజలి’ వంటి సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులనూ అలరించారు నారాయణ రావు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమతో అనుబంధాన్ని కొనసాగించారాయన. నారాయణరావుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
నా ఆత్మీయ మిత్రుడు జీవీ నారాయణరావుగారు
ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 1976లో ‘అంతులేని కథ’తో పరిచయమైన ఆయన ఎన్నో చిత్రాల్లోనూ, పలు టెలివిజన్ సీరియళ్లలోనూ తన విలక్షణమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. నారాయణరావుగారితో నాకెంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. ‘దేవాంతకుడు, యముడికి మొగుడు’ వంటి చిత్రాలను నాతో నిర్మించిన నిర్మాతగా మా ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – చిరంజీవి


