మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ కేటగిరీల కింద పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు తగ్గించాలని నిర్ణయించడం తగదని తెలంగాణ మున్సిపల్ అండ్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎన్‌ఎంఆర్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, వితంతు, వృద్ధాప్య పింఛన్లు వర్తింపజేయాలన్నారు. మరణించిన కార్మికుడి దహన సంస్కార ఖర్చులు రూ.30వేలతో పాటు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 27న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాకు మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి.సురేష్, సంఘం నాయకులు యాదయ్య, కృష్ణ, సత్యనారాయణరెడ్డి, చాంద్‌బాషా పాల్గొన్నారు.


