జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరు జిల్లా కళలకు పెట్టింది పేరని తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పీజీ విందా అన్నారు. ఎంఎస్‌ఎంఈ ఆధ్వర్యంలో సినిమా క్రియేటర్స్ సహకారంతో మంగళవారం స్థానిక జెడ్‌ఎంఎస్‌లో ‘ఫ్రేమ్స్ ఆఫ్ ఫౌండర్స్’ క్రియేటివ్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీ విందా మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలోనూ ఎన్నో ప్రత్యేకమైన కథలు ఉన్నాయని, స్థానిక కథలను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. వర్క్‌షాప్ ద్వారా వెలుగులోకి వచ్చే ఉత్తమ కథలను ఎంపిక చేసి, సినిమాలుగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు, యువ క్రియేటర్లు, ఔత్సాహిక ఫిల్మ్‌మేకర్లు, వ్యవస్థాపకులు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర అథ్లెటిక్స్‌లోపతకాలు సాధించాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి అంతర్‌జిల్లాల అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర ఆకాంక్షించారు. హన్మకొండలో బుధ, గురువారాల్లో జరిగే అండర్–14, 16, 18, 20 విభాగా ల బాలబాలికల పోటీలకు జిల్లా క్రీడాకారులు మంగళవారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన శరత్‌చంద్ర.. పతకాలు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని సూ చించారు. జిల్లా నుంచి వివిధ విభాగాల్లో 14 మంది బాలికలు, 20 మంది బాలురు పోటీల్లో పాల్గొంటున్నారు. అండర్–14లో ట్రయథ్లాన్, అండర్–16లో 60మీ, 600మీ, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్, జావెలిన్ విభాగాల్లో, అండర్–18, 20లో పరుగు, రేస్‌వాక్, డిస్కస్, షాట్‌పుట్, జావెలిన్, హర్డిల్స్, హెపథ్లాన్, స్టీపుల్‌చేజ్ వంటి అంశాల్లో క్రీడాకారులు బరిలో దిగనున్నారు. కార్యక్రమంలో ఆనంద్, సునీల్‌కుమార్, సి.శ్రీనివాసులు, కె.రమేష్‌బాబు, పి.శ్రీనివాస్, సుగుణ పాల్గొన్నారు.
అనుమానాస్పదంగా ఒకరు మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పదంగా ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం గద్వాల మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన అశోక్(45) కొన్ని సంవత్సరాలుగా అనంతపురంలో ఇంటి నిర్మాణ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నాడు. అయితే గ్రామ శివారులో శవమై కన్పించాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి చూడగా శరీరంపై గాయాలు ఉండడంతో రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుడు కొండన్నకు సమాచారం ఇచ్చారు. సాధారణ మృతి లేక ఎవరైన దాడి చేసి గాయపర్చరా అనే కోణంలో విచారణ చేపడుతామని పోలీసులు తెలిపారు.
విష పురుగు కరిచి బిహార్ వాసి మృతి
మక్తల్: విష పురుగు కరిచి బిహార్ వాసి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం బిహార్ రాష్ట్రం బాగల్‌పూర్ జిల్లా, మధురాపూర్ మండలం కరికోడ్ గ్రామానికి చెందిన షేక్ ముర్తాజ్(45) హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నెల రోజుల క్రితం మక్తల్‌లో బిహర్‌కు చెందిన ఎల్‌ఎస్ మేసీ్త్ర దగ్గర ఆయనతో పాటు 10 మంది కలిసి పని చేసేందుకు వచ్చారు. 24న రాత్రి ఓ గదిలో నిద్రిస్తున్న సమయంలో విషపురుగు కాటు వేసింది. ఈ విషయాన్ని పక్కన ఉన్న షేక్ అన్సారీకి తెలపగా చికిత్స నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేయగా అక్కడి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు షేక్ తస్లిమ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తునట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.


