పాలమూరు: ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికారులు పనితీరు మార్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశించారు. గతంలో జరిగిన హెచ్‌డీఎస్ సమావేశంలో తీర్మానించిన పనులు ఎందుకు పూర్తి చేయలేదని జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ (హెచ్‌డీఎస్) సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో కలెక్టర్ సమీక్షించారు. రోగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన 16 గదులను ఇప్పటివరకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. నేటి నుంచే వాటిని రోగులకు కేటాయించి, వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ గదుల కేటాయింపు వివరాలను ఫొటోలతో వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యుల సమయపాలనపై కలెక్టర్ ఆరా తీశారు. సాయంత్రం 5 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉంటారని సూపరింటెండెంట్ చెప్పగా.. ఆ తర్వాత అత్యవసర రోగులకు ఎలా వైద్యం అందిస్తారని ప్రశ్నించారు. ఎంసీహెచ్ భవనంలో ల్యాబ్ లేకపోవడంతో గర్భిణీలు శాంపిల్స్ తీసుకుని టీ–హాబ్ వరకు వెళ్లాల్సి వస్తోందని హెచ్‌డీఎస్ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంసీహెచ్ భవనంలో 24 గంటలూ ల్యాబ్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్యులపై పని భారం పెరుగుతోందని డాక్టర్ సునీల్ తెలిపారు. ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా అని కలెక్టర్ సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఆస్పత్రి అంతర్గత రోడ్ల మరమ్మతులు, ట్రాలీలు, వీల్‌చైర్లు, లేబర్ టేబుల్స్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ నిధులతో అవసరమైన పరికరాల జాబితా సిద్ధం చేసి రెండు రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఐసీయూకు కార్డియాక్ మానిటర్లు అవసరమని వైద్యులు తెలిపారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాసులు, ఆర్‌ఎంఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వివిధ విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.
రూ.32 లక్షల పరికరాలు ప్రారంభం
విర్చో పెట్రో కెమికల్స్ కంపెనీ ఫౌండేషన్ సహకారంతో ఎంసీహెచ్ భవనంలోని గైనిక్ విభాగానికి రూ.32 లక్షల విలువైన అల్ట్రాసౌండ్ స్కానర్, ఫొటోథెరపీ యూనిట్లు, ఆర్థో విభాగానికి సీ–ఆర్మ్ ఆర్థోపెడిక్ ఆపరేషన్ యంత్రం, సర్జికల్ డ్రిల్ తదితర ఏడు రకాల వైద్య పరికరాలను సమకూర్చారు. వీటిని శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు.
జనరల్ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
హెచ్‌డీఎస్ సమావేశంలో కలెక్టర్ ఖుష్బూగుప్తా ఆదేశాలు
16 ప్రత్యేక గదులను నేటి నుంచే రోగులకు కేటాయించాలి
ఎంసీహెచ్‌లో 24 గంటల ల్యాబ్ అందుబాటులో ఉండాలి
హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి


