జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూ సేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాసానికి సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసే లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతు జిల్లాలోని ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో మాట్లాడి పరిష్కరించాలని చెప్పారు. అంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఆయకట్టు సృష్టి్‌ంచేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పునరావాస పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్‌రెడ్డి, డీఈ మనోహర్, డీటీ రాణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


