● 22 పరుగుల తేడాతో విక్టరీ జట్టుపై విజయం
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లో జరుగుతున్న సీ–డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్–4 (మహబూబ్‌నగర్) జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు 22 పరుగుల తేడాతో విక్టరీ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్–4 జట్టు 39 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ పి.రామ్‌కుమార్‌చారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 102 బంతుల్లో 12 ఫోర్లతో 97 పరుగులు చేశాడు. విక్టరీ బౌలర్ సమిత్‌వర్మ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన విక్టరీ జట్టు 35.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో ఓంకారేశ్వర్ 93 పరుగులు చేశాడు. జిల్లా బౌలర్లు అభినవ్ 3, శ్రీశాంత్, ఎండీ సోహైల్, వసికర్, ధనుష్ చెరో వికెట్ తీశారు. వన్డే లీగ్‌లో జిల్లా జట్టు విజయం సాధించడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. రానున్న మ్యాచుల్లో ఇదే స్ఫూర్తితో ఆడి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


