అదుపుతప్పిన బైక్‌.. యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన బైక్‌.. యువకుడు మృతి

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

గట్టు: రాత్రంతా గొర్రెల మంద వద్ద కాపలా ఉండి, తెల్లవారుజామున ఇంటికి బయలుదేరిన యువకుడు బైక్‌ అదుపు తప్పడంతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం.. పెంచికలపా డు గ్రామానికి చెందిన వెంకటన్న, పద్మమ్మ దంపతుల చిన్న కుమారుడు కుర్వ గోవర్ధన్‌ (18) బోయ ఈశ్వర్‌తో కలిసి శనివారం రాత్రంతా గొర్రెల మందకు కాపలాగా ఉండి ఆదివారం తెల్లవారుజామున బైక్‌పై ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో వీరి ద్విచక్ర వాహ నం అదుపు తప్పి, రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోవర్ధన్‌, ఈశ్వర్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గద్వాల ఆస్పత్రికి తరలించగా.. గోవర్ధన్‌ చికి త్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గా యపడిన బోయ ఈశ్వర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తీసుకెళ్లారు. ఘనపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ శేఖర్‌గౌడ్‌ తెలిపారు.

తనగలలో బంగారం,

వెండి ఆభరణాల చోరీ

రాజోళి: వడ్డేపల్లి మండలంలోని తనగల గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి కల్వకుర్తికి వెళ్లారు. తిరిగి అదే రోజు రాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లి చూడగా.. బీరువా తెరుచుకొని ఉండడంతో అనుమానంతో బీరువాలో గమనించారు. తాళం పగలగొట్టి అందులో ఉన్న నాలుగు తులాల బంగారు వస్తువులు, 8 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఈ విషయమై బాధితుడు శాంతిగనర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సీఐ శంకర్‌తో కలిసి ఎస్‌ఐ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

చికిత్స పొందుతూ

వ్యక్తి మృతి

కొత్తకోట రూరల్‌: బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి తండా స్టేజీ సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దమందడి ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమందడి గ్రామానికి చెందిన కురుమూర్తి (36) వ్యక్తిగత పనిమీద తన చెల్లెలు ఊరైన జంగమయ్యపల్లికి శనివారం మధ్యాహ్నం వెళ్లాడు. తిరిగి రాత్రి 11 గంటల సమయంలో స్వగ్రామానికి బైక్‌పై వస్తుండగా.. పామిరెడ్డిపల్లి తండా స్టేజీ సమీపంలో బైక్‌ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో వనపర్తి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య జనిగె లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

వనపర్తి రూరల్‌: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ జరిగిన ఘటన శనివారం అర్ధరాత్రి పెబ్బేరు మండలంలోని తోమాలపల్లిలో చోటుచేసుకుంది. సర్పంచ్‌ అశోక్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. తోమాలపల్లి పంచాయతీకి సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆదివారం పెబ్బేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

స్కూటీలో

నాగుపాము ప్రత్యక్షం

మరికల్‌: మండలకేంద్రంలో ఓ వ్యక్తి స్కూటీలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో అతడు ఖంగుతిన్నాడు. తీలేర్‌కు చెందిన కుర్వ నిరంజన్‌ ఆదివారం స్కూటీపై తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. పొలంలోనే స్కూటీని ఆపి పనులు ముగించుకొని నేరుగా మరికల్‌కు వచ్చాడు. కిరాణ సామగ్రి తీసుకొని డిక్కీలో పెట్టేందుకు దానిని తెరిచాడు. అందులో నాగుపాము బూసలు కొడుతూ పైకి లేవడంతో అక్కడ ఉన్న వారందరూ భయంతో పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కర్రతో పామును కిందకు తోసేసి చంపేశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement