సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయం

Jul 6 2026 12:58 AM | Updated on Jul 6 2026 12:58 AM

గండేడ్‌: సనాతన ధర్మ సంరక్షణలో ఎన్ని సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గేదిలేదని అంబాత్రయ క్షేత్రం ఆదిత్యపరాశ్రీస్వామి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని వెన్నాచేడ్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, పరాశ్రీ చేతులమీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. హిందూధర్మం ప్రపంచ దేశాలకే ఆదర్శమని అన్నారు. సనాతన ధర్మాన్ని మంటగలిపేందుకు ఎన్నో కుయుక్తులు పన్నుతున్నారని అలాంటి వాటిని అడ్డుకునేందుకు సాధు సన్యాసులు స్వామీజీలు తప్పకుండా అడ్డుకుంటారని తెలిపారు. పరధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదని గ్రామాల్లో కందురలు, పీర్లపండుగలు బందు చేయాలని హిందువులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని బ్రహ్మాండమని అంటారు కాని అల్లాండం, క్రీస్తుఆండం అని పిలువరని తెలిపారు. తాము ప్రపంచ దేశాల్లో మార్పు తీసుకొచ్చేందుకు నిరంతర సాధన చేస్తున్నామని.. అది క్రమంగా నెరవేరుస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మార్పు రావాలని హిందూధర్మ పరిరక్షణ ప్రతీ ఒక్కరి ఆకాంక్ష కావాలని కోరారు.

హిందూ ధర్మాన్ని రక్షించాలి

హిందూ ధర్మ పరిరక్షణలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవంతరాలు ఎదురైనా కేసులకు జైళ్లకు భయపడేదిలేదని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. శివాజీ హిందూధర్మ పరిరక్షణ కోసం ఎన్నో యుద్ధాలు చేశారన్నారు. ఈ క్రమంలో ఆయన ఏనాడు కూడా తన స్వార్థం స్వలాభం గురించి ఆలోచించలేదని ధర్మ పరిరక్షణే లక్ష్యంగా యుద్ధాలు చేశారన్నారు. ముఖ్యంగా ఆయన తల్లి జిజియాను ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలను పెంచి పోషించాలని సూచించారు. శివాజీ ఆశయాలను ఇంటింటా తీసుకెళ్లాలని తమ పిల్లలను శివాజీ శంభాజీల్లా తయారు చేయాలని పేర్కొన్నారు. కలిసి వస్తే అక్కున చేర్చుకుంటామని దుష్టాలోచన చేస్తే అంతు చూస్తామన్నారు, మన హిందువులే పరులకు చెంచాగిరి చేస్తూ ధర్మాన్ని ముందుకు సాగనివ్వడంలేదని అసలైన హిందువులే వారిని అడ్డుకుని ధర్మపరిరక్షణకు పాటుపడాలని తెలిపారు. మనం తాగేది ఆవుపాలే కాని గాడిదపాలు కాదని ప్రతీ ఒక్కరూ గోవును పెంచుకోవాలని వాటని సంరక్షించే భాద్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రతీ ఒక్కరూ ధర్మాన్ని కాపాడాలని తెలిపారు. శివాజీ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నవనీత, ఛత్రపతి యువజన సంఘం అధ్యక్షుడు కేశవులు, విగ్రహదాత వెన్నె ఈశ్వరప్ప, వికారాబాద్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రహాళ్లద్‌రావు, పరిగి ఇన్‌చార్జి మారుతికిరణ్‌, ఆర్‌బీఓఎల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు అనంతలక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి పుల్లారెడ్డి, మహమ్మదాబాద్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు నారాయణ, మల్లప్ప, సత్యసాయి సేవాసమితి జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి శివమాజీ సర్పంచ్‌ గోపాల్‌, రాంరెడ్డి, రవికాంత్‌రెడ్డి, పులీందర్‌రెడ్డి, ఆయా గ్రామాల యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement