హన్వాడ: జిల్లాలోని మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు, విద్యార్థులకు అందించే సేవలను ప్రభుత్వం మరింత సులభతరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మీసేవ పోర్టల్‌లో తాజాగా ‘ఎస్సెస్సీ మెమో ఈ–కాపీ’ అనే సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన డిజిటల్ సేవ ద్వారా 2004 నుంచి 2024వ సంవత్సరం వరకు ఎస్సెస్సీ (10వ తరగతి) ఉత్తీర్ణులైన విద్యార్థులు తమ ఎస్సెస్సీ మెమో (డూప్లికేట్ ఈ–కాపీ) ను సమీపంలోని మీసేవ కేంద్రాల ద్వారా అత్యంత సులభంగా పొందవచ్చు. కేటగిరీ ‘ఏ’ కింద ఒక్కో దరఖస్తుకు రూ.62 సేవా రుసుము చెల్లించి, అభ్యర్థి వివరాలను నమోదు చేయడం ద్వారా మీసేవ ‘సెక్యూర్ బేస్ సర్టిఫికెట్’పై ఈ–మెమో ప్రింట్ తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఉన్నత చదువులకు అడ్మిషన్లు జరుగుతున్న తరుణంలో ఈ సేవ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
పూర్తిగా కాగిత రహిత విధానం
మరోవైపు జిల్లావ్యాప్తంగా మీసేవ సేవల్లో కాగిత రహిత (పేపర్ లెస్) విధానాన్ని జిల్లా యంత్రాంగం మరింత సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇకపై ఆదాయం, కులం, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి రెవెన్యూ సేవల వెరిఫికేషన్ కోసం దరఖాస్తుదారులు ఎలాంటి భౌతిక పత్రాలను (ఫిజికల్ డాక్యుమెంట్లు) కార్యాలయాల్లో సమర్పించాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన పేరిట దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల కోసం ఒత్తిడి తీసుకురావొద్దని జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) సంస్థ ప్రవేశపెట్టిన నూతన మొబైల్ అప్లికేషన్ ద్వారానే వీఆర్‌ఓ, తహసీల్దార్లు ఆన్‌లైన్‌లో పత్రాలను పరిశీలించి వేగంగా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. డిజిటల్ విప్లవంలో భాగంగా అటు ఎస్సెస్సీ ఈ–మెమోలు, ఇటు పేపర్‌లెస్ రెవెన్యూ సేవలతో దరఖాస్తుదారులకు సమయం, డబ్బు ఆదా అవుతుందని, ఈ నూతన అవకాశాలను జిల్లా ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఇక ఆన్‌లైన్‌లోనే
ఎస్సెస్సీ ఈ–మెమోలు..
2004–24 వరకు ఉత్తీర్ణులైన
వారికి అవకాశం
జిల్లాలో వేగంగా కాగిత రహిత
సేవల విస్తరణ
ఆదాయ, కుల ధ్రువీకరణల వెరిఫికేషన్‌కు తప్పిన భౌతిక పత్రాల సమర్పణ


