చేయూత నిలిచేనా..? | - | Sakshi
Sakshi News home page

చేయూత నిలిచేనా..?

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): చేయూత పింఛన్ల లబ్ధిదారుల లెక్క ఇంకా తేలడం లేదు. కొంతమంది లబ్ధిదారుల ఆచూకీ లేకపోవడంతో వివరాలు ఎలా నమోదు చేయాలలో అధికారులు సతమతం అవుతున్నారు. లబ్ధిదారుల ధ్రువీకరణకు జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టం(ఎస్‌ఆర్‌ఎస్‌) సిబ్బందికి సవాల్‌గా మారింది. జూన్‌ 15 నుంచి జిల్లావ్యాప్తంగా ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ప్రారంభించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు అన్వేషిస్తున్నారు. జిల్లాలో మొత్తం 96,343 మంది చేయూత లబ్ధిదారులున్నారు. వీరిలో వృద్ధాప్య పింఛన్‌ లబ్ధిదారులు 33,646, వితంతులు 41,224, దివ్యాంగులు 12,960, గీత కార్మికులు 990, చేనేత 882, బీడీకార్మికులు 2,085, ఒంటరి మహిళలు 4,556 లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.23,92,56,688 ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో 76,778 లబ్ధిదారులకు బ్యాంక్‌ ఖాతాలో పింఛన్‌ డబ్బులు నమోదు అవుతుండగా.. 19,565 మంది లబ్ధిదారులు పోస్టాఫీస్‌ అకౌంట్‌ ద్వారా పింఛన్‌ తీసుకుంటన్నారు. దీంతో వీరికి సంబంధించిన ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ నిర్వహించగా.. 1,246 మంది లబ్ధిదారులు చనిపోయినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 15,082 మంది ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టంలో పొందుపరిచారు. ఇంకా 3,608 మంది ఫేస్‌ రికగ్నిషన్‌ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఇందులో 935 మంది లబ్ధిదారుల లెక్క తేలాల్సి ఉంది. కొందరు అందుబాటులో లేకపోవడం, ఆధార్‌ కార్డుల సీడింగ్‌ సమాచారం పొంతన లేకపోవడం, ఇతర రాష్ట్రాల్లో ఉండడం, వీరిని గుర్తింపు సమస్యగా మారడం లాంటి వివిధ కారణాలతో ఫేస్‌ రికగ్నిషన్‌ లెక్క కొలిక్కి రాలేదు.

త్వరితగతిన ప్రక్రియ పూర్తి

జిల్లాలో ఫేస్‌ రికగ్నిషన్‌ పక్రియను త్వరితగతిన పూర్తి చేస్తాం. మున్సిపాలిటీల్లో ఆసరా, చేయూత పథకం లబ్ధిదారుల రికగ్నిషన్‌ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తాం. కొద్ది శాతం మిగిలింది. వివిధ కారణాలతో ఫేషియల్‌ రికగ్నిషన్‌ జరగని వారిని గుర్తించి సమగ్ర వివరాలు యాప్‌లో పొందుపరుస్తాం. – నర్సిములు, డీఆర్‌డీఓ

ఇంకా తేలని పింఛన్‌ లబ్ధిదారుల లెక్క

సవాల్‌గా మారిన ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ సవాల్‌.. సతమతమవుతున్న యంత్రాంగం

దొరకని 935 మంది లబ్ధిదారుల వివరాలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement