పెండింగ్‌ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ ప్రాజెక్టుల సాధనే లక్ష్యం

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

హన్వాడ: పాలమూరు జిల్లా జలవనరుల పరిరక్షణకు దశాబ్దాలుగా నలుగుతున్నా.. పెండింగ్‌ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన భారీ రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌నును జేఏసీ నాయకులు హన్వాడలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోరాటం రాజకీయాలకతీతంగా జిల్లా ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత విస్తారమైన కృష్ణానది పరివాహక ప్రాంతం దాదాపు 300 కి.మీ. మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే ఉన్నప్పటికీ.. సాగు, తాగునీటి కష్టాలు తప్పకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆవేదన వ్యక్తం చేశారు. 1983లో ప్రారంభించిన కల్వకుర్తి ఎత్తిపోతలు నేటికీ అసంపూర్తిగానే ఉందని, పాలమూరు–రంగారెడ్డి, జూరాల, భీమా, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యామని విమర్శించారు. అలాగే ఆర్డీఎస్‌ పరిధిలో కర్ణాటక అక్రమంగా నీటిని ఆపేస్తున్నా.. అడిగే నాథుడు కరవయ్యారన్నారు. జిల్లాలో 40 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, ప్రాజెక్టులు పూర్తి చేసి రిజర్వాయర్లలో నీటిని నింపితే వలసలు ఆగిపోతాయన్నారు. రాబోయే తరాల భవిష్యత్‌ కోసం ఈనెల 19న నిర్వహించే రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, ముఖ్యంగా రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి జలసాధన పోరాటాన్ని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బెక్కెం జనార్దన్‌, వీరబ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement