కందనూలు: అచ్చంపేట మండలం హాజీపూర్‌కు చెందిన రైతు జంచుక మసన్న జీవించి ఉండగానే.. ఆయన మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి, పట్టా భూమిని ప్రభుత్వ అసైన్డ్ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసిన ఘటనపై కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సీరియస్ అయ్యారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయి విచారణ చేపట్టిన కలెక్టర్.. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి ఆపరేటర్‌గా పనిచేస్తున్న మూడావత్ జైపాల్‌ను విధుల నుంచి తొలగించి.. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అచ్చంపేట తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించి.. ప్రస్తుతం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా (డిప్యుటేషన్)పై పనిచేస్తున్న ఎ.అశోక్‌కుమార్‌పై సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ నిర్లక్ష్యం కారణంగానే జీవించి ఉన్న రైతును మృతుడిగా చూపిస్తూ.. రికార్డుల్లో మార్పులు జరిగాయని.. ఫలితంగా రైతు పట్టాదారు భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమిగా నమోదై రైతు హక్కులకు తీవ్ర భంగం కలిగిందని విచారణలో వెల్లడైంది. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డీటీపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోక్సో కేసులో యువకుడు రిమాండ్
గద్వాల క్రైం: బాలికను అపహరించిన ఘటనలో ఓ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గద్వాల సీఐ శ్రీను తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గద్వాల మండలానికి చెందిన బాలికను అదే మండలానికి చెందిన అద్భుతకుమార్ అనే యువకుడు ఐదు రోజుల క్రితం ప్రేమ పేరుతో నమ్మించి అపహరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేసి.. గద్వాల కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
● డిప్యూటీ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
● భూభారతి ఆపరేటర్‌పై కేసు నమోదు


