●
కల్వకుర్తి టౌన్: ప్రకృతి వైపరీత్యాలతో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలతో పాటుగా పిడుగుపాట్లతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతూ ఉంటాయి. వర్షా కాలానికి ముందే వేసవికాలంలో వచ్చే అకస్మాత్తు వర్షాలతో ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. ప్రతిఏటా పిడుగులు పడి ఎక్కువ సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడటమే గాక, ప్రజలు ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పిడుగుపాటుపై పలు పరిశోధనలు చేసిన భారత వాతావరణ శాఖ అధికారులు పిడుగుపాటును ముందే పసిగట్టగలిగితే ప్రాణాలను కాపాడుకునేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటరాలజీ (ఐఐటీఎం) ‘దామిని’ యాప్‌ను రూపకల్పన చేసింది. దీనిపై అవగాహన పెంచుకోని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తోంది.
డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ప్రతి పౌరుడు మొబైల్‌ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి దామిని అని టైప్‌చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను ప్రారంభించాక మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, పిన్‌కోడ్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం జీపీఎస్ లొకేషన్ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. యాప్‌ను వాడుతున్న సమయంలో మీ ప్రాంతంలో పిడుగుపడే అవకాశాలు ఉన్నాయో లేదో మూడు రంగుల గుర్తులను కలర్ల కింద చూపిస్తుంది. వాటి ఆధారంగా మీరు ఉన్న చోట పిడుగుపడే అవకాశం ఉంటే ముందే హెచ్చరిస్తుంది.
రెడ్ కలర్: మీరు ఉన్న ప్రాంతంలో మరో 7 నిమిషాల వ్యవధిలో పిడుగుపడే అవకాశం ఉందని ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి వస్తుంది.
ఎల్లో కలర్: మరో 10– 15 నిమిషాలలో పిడుగుపడే అవకాశం ఉంటే యాప్‌లోని మీరు ఉన్న ప్రాంతం సర్కిల్ ఎల్లో కలర్‌లోకి మారుతుంది.
బ్లూ కలర్: మరో 18– 25 నిమిషాలలో మీరు ఉన్న ప్రాంతంలో పిడుగుపడే అవకాశం ఉందని, ఆ ప్రాంతం సర్కిల్ బ్లూ కలర్‌లోకి మారుతుంది.
జాగ్రత్తలు పాటిస్తే...
● నల్లని మబ్బులు ఆకాశం అంతటా విస్తరించి భారీ వర్షం కురుస్తున్నప్పుడు రైతులు పంట పొలాల్లో తిరగకుండా ఏవైనా భవనాలు లేకపోతే తాము ఉన్న స్థానంలోనే మోకాళ్లపై కూర్చొని రెండు చెవులను తమ చేతులతో మూసుకోవాలి.
● బహిరంగ ప్రదేశాల్లో పిడుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంట పొలాల్లో మొబైల్ వాడకూడదు. మొబైల్ నుంచి వచ్చే సిగ్నల్ పిడుగుపడే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది.
● విద్యుత్ సరఫరా అయ్యే పరికరాలకు (విద్యుత్ స్తంభాలు, సెల్‌ఫోన్ టవర్లు, బోర్ పంపుసెట్ల) దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే నీటిని కూడా ఆ సమయంలో ఉపయోగించరాదు.
● పాడి పశువులను మేతకు బయటకు తీసుకెళ్లకుండా పాకలోనే ఉంచాలి.
● వర్షం కురిసినప్పుడు చెట్ల కింద ఉండొద్దు. పిడుగులు పొడవైన చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
యాప్ ఉపయోగకరం
వాతావరణంలో మార్పులను పసిగట్టి పిడుగుపడే అవకాశాన్ని తెలిపే దామిని యాప్ ప్రజలతో పాటుగా ముఖ్యంగా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. యాప్‌ని వినియోగించటం వలన పిడుగుపడే విషయాన్ని గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.
– జనార్ధన్ రెడ్డి, ఆర్డీఓ, కల్వకుర్తి
పిడుగుపాటుపై ముందస్తు హెచ్చరికలు చేస్తున్న యాప్
జాగ్రత్తలు పాటిస్తే నుంచి బయటపడే అవకాశం
అకాల వర్షాలు, పిడుగులతో ప్రాణాలను కోల్పోతున్న ప్రజలు


