నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతి

Jul 5 2026 7:14 AM | Updated on Jul 5 2026 7:14 AM

అమ్రాబాద్‌: నీటి సంపులో పడి ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమ్రాబాద్‌ మండలం మాదవానిపల్లికి చెందిన ఎస్జీటీ గాజుల మోహన్‌ (26) ఇదే మండలంలోని కల్ములోనిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇన్‌చార్జి హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శుక్రవారం లక్ష్మాపూర్‌ (బీకే)లో జరిగే బంధువు వివాహానికి వెళ్లారు. అందరితో కలిసి ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న నీటి సంపులో పడ్డాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని సంపులో నుంచి బయటికి తీసి.. ప్రైవేటు వాహనంలో అమ్రాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సంేపులో పడే సమయంలో తలకు బలమైన గాయమై అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య అఖిల, తల్లిదండ్రులు సుగుణమ్మ, చెన్నకిష్టయ్య ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతితో పెళ్లింట విషాదచాయలు అలుముకున్నాయి. ఎంఈఓ బాలకిషన్‌ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు.

బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్‌.. వ్యక్తి మృతి

వనపర్తి రూరల్‌: ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం పెబ్బేరు మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌గౌడ్‌ వివరాల ప్రకారం.. మండలంలోని సూగూరు గ్రామానికి చెందిన చనమోని శ్రీనివాసులు(46) శనివారం బైక్‌పై పెబ్బేరుకు వచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో బునాదిపురం గ్రామ శివారులోని కోళ్ల షెడ్డు వద్ద ట్రాక్టర్‌ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

అచ్చంపేట రూరల్‌: ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో యువకుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని బొమ్మనపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొర్రతండాకు చెందిన సిద్దూ (19) కూలీ పనుల నిమిత్తం బొమ్మనపల్లిలో ఓ ఇంటి నిర్మాణంలో పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్‌ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

గద్వాల క్రైం: ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గద్వాల మండలం కుర్వపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ వివరాల మేరకు.. కుర్వపల్లికి చెందిన కుర్వ గోపాల్‌(40) పంటల సాగు, కుటుంబ అవసరాల కోసం తెలిసిన వ్యక్తుల వద్ద కొంత అప్పు చేశాడు. అయితే అప్పులు చెల్లించే దారిలేక మనస్తాపానికి గురైన అతడు.. వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement