18న ఎన్‌ఐ యాక్ట్‌పై లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

18న ఎన్‌ఐ యాక్ట్‌పై లోక్‌ అదాలత్‌

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

పాలమూరు: జిల్లాలో ఈనెల 18న జిల్లా కోర్టు ఆవరణలో ఎన్‌ఐ యాక్ట్‌ కేసులపై ప్రత్యేక లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.ప్రేమలత ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టులో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కేసులలో ఉన్న కక్షిదారులు, చిట్‌ఫండ్స్‌, ఫైనాన్స్‌ కంపెనీల నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

టీఈడీఎక్స్‌ సదస్సుకు ప్రభుత్వ విప్‌

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నోయిడాలో ఈనెల 4న టీఈడీఎక్స్‌ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో ‘మహబూబ్‌ నగర్‌ ఫస్ట్‌’ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు.

వేతనాల పెంపునకు పోరుబాట

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలంటూ ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పోరుబాట పడుతున్నామని తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్‌ చెప్పారు. దీనికి సంబంధించి శుక్రవారం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.రంగా అజ్మీరాకు సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య, సెక్యూరిటీ, పేషంట్‌ కేర్‌ సూపర్‌వైజర్‌ కార్మికుల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించారన్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులు పారదర్శకంగా లేవన్నారు. ఈ కార్మికుల వేతన చెల్లింపుల్లో అనేక అవినీతి అక్రమాటు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఆస్పత్రి పడకల సామర్థ్యానికి అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలన్నారు. ఏజెన్సీల వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్‌ ద్వారానే వేతనాలు చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఈనెల 7, 8న ప్రభుత్వ ఆస్పత్రుల ఎదుట ఆందోళన చేపట్టనున్నామన్నారు. అలాగే 9న చలో హైదరాబాద్‌ పేరిట కోఠిలోని తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, వైద్య విధాన పరిషత్‌ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.చెన్నయ్య, ఎస్‌.దేవానంద్‌, రంగన్న, భీమన్న, శ్రీనివాస్‌రెడ్డి, జగ్గానాయక్‌, సాయిప్రకాష్‌, లక్ష్మి, నరేష్‌ పాల్గొన్నారు.

జూపల్లి వ్యాఖ్యలకు

కట్టుబడి ఉన్నాం

కందనూలు/ లింగాల: కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తామంతా కట్టుబడి ఉన్నామని ఎంపీ మల్లురవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం రూ.8.21 లక్షల కోట్ల అప్పు చేసిందని, వీటికి తమ ప్రభుత్వం ప్రతినెలా రూ.6.800 కోట్ల వడ్డీ కడుతుందని పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, అలా చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. తమ సవాల్‌ను స్వీకరించే దమ్ము లేక ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఎదురు దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, అది చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ప్రచారం మానుకోవాలని, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement