ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలి

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

రాజ్యాంగం ప్రజల చేతిలో

ఉండాలి

ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఫాసిజం నుంచి అందరూ బయటపడాలని, ఏమి మాట్లాడితే ఏమి జరుగుతుందోననే భయాందోళన చాలా మందిలో నెలకొందని ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించొద్దన్నారు. అందరికీ విద్య సమంగా అందాలని, మానవీయ సమాజం కావాలని, ప్రజాస్వామ్యాన్ని అందరూ కాపాడుకోవాలన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం కార్యాలయంలో ‘ఎస్‌ఐఆర్‌ నేపథ్యం, ప్రత్యేకతలు, పర్యవసానాలు’పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కులను కాపాడాలని, రాజ్యాంగం సంపన్న వర్గాల వద్ద కాకుండా ప్రజల చేతిలో ఉండాలన్నారు. ప్రపంచీకరణ పేరుతో ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా ప్రజల సంక్షేమాన్ని పాలకులు గాలికొదిలేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికారం కేంద్రీకృతం కావొద్దని దీనివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. దేశ భవిష్యత్‌ కోసం ఆర్థిక విధానాలు మారాలని, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలతో ఎస్‌ఐఆర్‌ సంబంధమే లేదన్నారు. వాస్తవానికి పాలకులను ఓటరు ఎన్నుకోవాలి..అలాంటిది ఓటర్లను పాలకులే మభ్యపెడుతూ తమ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డా.పరకాల ప్రభాకర్‌ మాట్లాడుతూ సర్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పేర్కొన్నారు. దీని పేరిట సమాజంలోని కొన్ని వర్గాల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, ధరలతో పాటు కూలీలు, యువతకు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వీటిని పక్కనబెట్టి కేవలం ‘సర్‌’పై దృష్టి పెట్టడమేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు ఎస్‌.జగపతిరావు, ఉపాధ్యక్షుడు ఎ.రాజసింహుడు, సభ్యులు నస్కంటి నాగభూషణం, కోటేశ్వర్‌రెడ్డి, ఎ.తిమ్మప్ప, న్యాయవాది బెక్కం జనార్దన్‌, పాలమూరు అధ్యయన వేదిక ప్రతినిధులు ఎం.రాఘవాచారి, హనీఫ్‌అహ్మద్‌, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement