కొత్తగా 5,016 మందికి రైతు భరోసా | - | Sakshi
Sakshi News home page

కొత్తగా 5,016 మందికి రైతు భరోసా

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

కొత్తగా 5,016 మందికి రైతు భరోసా

జూన్‌ 15 నాటికి పాస్‌ పుస్తకాలు

పొందిన వారికి అవకాశం

దరఖాస్తుకు ఈ నెల 5వ తేదీ వరకు గడువు

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 15వ తేదీ నాటికి కొత్త పట్టా పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం తగిన పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో ఏఈఓలకు ఈ నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో మరికొంత మంది రైతులు లబ్ధి పొందనున్నారు. కటాఫ్‌ తేదీ ప్రకారం జిల్లాలో కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన వారు 5,016 మంది ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులు జూన్‌ 30వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా పెట్టుబడి సాయం అందనుంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. కొత్త పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేలా వ్యవసాయ అధికారులు వాట్సాఫ్‌ గ్రూపుల్లో, స్టేటస్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. జిల్లాలో వానాకాలం రైతు భరోసా కోసం మొత్తం 2,63,019 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు రూ.263.19 కోట్ల నిధులు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement