మీసేవలో డిజిటల్‌ విధానం | - | Sakshi
Sakshi News home page

మీసేవలో డిజిటల్‌ విధానం

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి

మరింత మెరుగు

మీ సేవలో పక్కాగా అమలు

మీసేవ కేంద్రాల్లో రశీదుకు స్వస్తి

దరఖాస్తుదారుడి ఫోన్‌కి హైపర్‌ లింక్‌

మెసేజ్‌ డిలీట్‌ అయితే తిరిగి పంపించే వెసులుబాటు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌)/కల్వకుర్తి టౌన్‌: రెవెన్యూ కార్యాలయంలో కుల, ఆదాయ, నివాస, తదితర సర్టిఫికెట్ల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు నిర్వాహకులు సంబంధిత రశీదు ఇస్తారు. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ కావడంతో ఇక రశీదులు కనుమరుగు కానున్నాయి. గతంలో రశీదులు పోతే సంబంధిత ధ్రువపత్రాలు పొందేందుకు ఎంతో ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ కావడంతో రశీదు స్థానంలో దరఖాస్తుదారుల ఫోన్‌నంబర్‌కు మెసేజ్‌ రూపంలో సంబంధిత సేవ వివరాలను పంపించనున్నారు. దాని ద్వారానే దరఖాస్తుదారుడు అతను పొందే సేవ వివరాలను చూసుకోవచ్చు.

మొబైల్‌కు రశీదు లింకు

మీ సేవలో ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న వెంటనే దరఖాస్తుదారుడికి ఒక మెసేజ్‌ వస్తుంది. అందరూ అప్లికేషన్‌ నంబరు, సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలతో పాటు ఒక హైపర్‌ లింక్‌ వస్తుంది. దరఖాస్తుదారులు ఆ లింకుపై క్లిక్‌ చేసి వారి అక్నొలడ్జిమెంట్‌ రసీదును ఎప్పుడైనా చూసుకోవచ్చు లేదా డౌన్‌ లోడ్‌, ప్రింట్‌ తీసుకోవచ్చు. సర్టిఫికెట్‌ చేతికి వచ్చేవరకు ఈ మెసేజ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

స్పష్టమైన ఆదేశాలు

మీసేవ కేంద్రాలకు నూతనంగా వచ్చిన నిబంధన ప్రకారం మీసేవ నిర్వాహకులు, ఆపరేటర్లు దరఖాస్తుదారుల నుంచి ఖచ్చితమైన, యాక్టివ్‌లో ఉన్న మొబైల్‌ నంబర్లను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది. ఈనెల 19వ తేదీ నుంచి ఎలాంటి ఫిజికల్‌ (కాగితపు) రసీదులను ప్రింట్‌ తీసి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి పాత పద్ధతిలోని కాగిత రసీదులు జారీ చేస్తే సదరు కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని మీసేవ కేంద్రాల అధికారులు హెచ్చరిస్తున్నారు. అప్లికేషన్‌ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్‌ నంబర్‌ మాత్రమే ఇవ్వాలని, లేదంటే భవిష్యత్తులో అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని విభాగాలు విస్తరించేలా..

ఆన్‌ లైన్‌ లో మీసేవ ద్వారా అందించే సేవలను కేవలం రెవెన్యూ శాఖలో మాత్రమే పేపర్‌ లెస్‌ సేవలను అందిస్తున్నారు. మీ సేవలో ముఖ్యంగా మున్సిపల్‌, పోలీసు ఇతర విభాగాలలో అందించే సేవలకు సంబంధించి వాటిని కూడా పేపర్‌ లెస్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

కాగిత రహిత పాలనే ధ్యేయంగా నూతన విధా నం అమలు చేస్తున్నాం. దీనికి సంబం ధించిన ఉత్తర్వులను ఇప్పటికే మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు అందజేశాం. మీసేవ కేంద్రాల్లో పేపర్‌ రశీదు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతున్నాం.

– చంద్రశేఖర్‌, ఈడీఎం

మీ సేవ కేంద్రాల్లో రెవెన్యూ లాగిన్‌ లో ప్రజలు ఆదాయ, నివాస, కుల, సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఫిజికల్‌ దరఖాస్తు ఫారాలు కార్యాలయాలకు పంపిస్తే అక్కడ అధికారులకు దొరక్క నెలల తరబడి పెం డింగ్లోనే ఉంటున్నాయి. మళ్లీ జిరాక్స్‌ ప్రతులను తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పేపర్‌ లెస్‌ సేవలతో ఆ పరిస్థితి ఉండదు.

– షేక్‌ రఫీ సిరాజ్‌,

తెలంగాణ మీసేవ ఫెడరేసన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

జిల్లాలోని మీసేవ కేంద్రాలలో ప్రజలు పొందే సేవలకు గాను ఇచ్చే రసీదులకు స్వస్తి చెప్పి పూర్తిగా డిజిటల్‌ రూపంలో వారికి అందించే సేవలు పక్కాగా అమలు చేయాలని సూచించాం. పేపర్‌ లెస్‌ విధానంలో భాగంగా ప్రజలు మీ సేవలో దరఖాస్తు చేసుకోగానే వారి మొబైల్‌ ఫోన్‌కు మెసేజ్‌ రూపంలో సందేశం వస్తుంది దాని ద్వారానే వారి యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.

– అమరేందర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, రెవెన్యూ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement