● ఓటర్ల జాబితా సవరణలో
కీలకంగా యాప్
● బీఎల్‌ఓల యాప్‌లో
మాడ్యూళ్లతో పారదర్శకత
● సర్వే వివరాలు, మ్యాపింగ్ అంతా ఆన్‌లైన్‌లోనే..
అచ్చంపేట: ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపకల్పన చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కొనసాగుతుంది. ఈ క్రమంలో లోటుపాట్లు ఎదరుకాకుండా ఎన్నికల సంఘం సరికొత్త సాంకేతికతను జోడించింది. ఇందుకోసం ఇంటింటా వివరాలు సేకరించే బూత్ లెవల్ అధికారి(బీఎల్‌ఓ)ల కోసం యాప్‌లోని ఎసినెట్ ఆప్టికేషన్లలో మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఫీ–డ్రాఫ్ట్, పోస్ట్ డ్రాప్ట్ మాడ్యూళ్లను చేర్చారు.
వారు.. ప్రత్యేకం..
బీఎల్‌ఓలు ఓటరు ఇంటికి ఓ సారి వెళ్లినప్పుడు లేకపోతే మరో రెండు సార్లు వెళ్లాలి. అయినప్పటికీ అందుబాటులో లేకపోయినా, ఓటరు చనిపోయినా, శాశ్వతంగా వలస వెళ్లినా, ఫారంపై సంతకం చేయడానికి నిరాకరించినా ప్రత్యేకంగా నమోదు చేయాలి. ఇందుకు సంబంధించిన వివరాలను 150 అక్షరాల్లో రాసి ఫారాన్ని యాప్‌లో అప్‌లోడ్ చేసి మార్క్ అన్‌కలెక్టబుల్‌గా నమోదు చేయాల్సి ఉంటుంది.
పొరపాట్లు జరగకుండా..
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం అభ్యంతరాలు, సవరణల కోసం యాప్‌లో ప్రత్యేక ఫీచర్లు చేర్చారు. ఓటరు పేరు, బంధుత్వాల పేర్లలో తప్పులు ఉంటే (గత ఓటరు లిస్ట్‌తో తండ్రి పేరు సరిపోకపోతే) యాప్ చూపిస్తుంది. దీంతో ఆధారాలను బీఎల్‌ఓలు అప్‌లోడ్ చేయడమే కాక, అభ్యంతరాలపై విచారణ నోటీసులకు ఇచ్చిన రసీదులను కూడా నమోదు చేయాలి. విచారణ సమయాన గ్రూప్ ఫొటో, అటెండెన్స్ షీట్‌ను సైతం లైవ్‌లో అప్‌లోడ్ చేయడాన్ని తప్పనిసరి చేశారు. ఓటరు గుర్తింపు కార్డులోని పాత ఫొటో స్పష్టంగా లేకపోతే కొత్త ఫొటోను యాప్ ద్వారా పరిశీలించి అప్‌డేట్ చేయొచ్చు. ఇక 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అనుమానాస్పద ఇళ్లల్లో లేని, ఇళ్లు మారిన, చనిపోయిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరొసారి పక్కాగా నిర్ధారించుకునే సదుపాయం బీఎల్‌ఓలకు యాప్ ద్వారా కల్పించారు.
ఒకే క్లిక్‌తో అధికారుల డైరెక్టరీ
క్షేత్రస్థాయిలో తిరిగే బీఎల్‌ఓలకు ఏలాంటి అత్యవసర సాయం కావాలన్నా.. ఉన్నతాధికారులను సంప్రదించాలన్నా ఎసినెట్ యాప్‌లోనే ప్రత్యేక కాంటాక్ట్ డైరెక్టరీని పొందుపరిచారు. ఇందులో సీఈఓ, డీఈఓ, ఈఆర్‌ఓ, ఆర్‌ఓ, ప్రిసైడింగ్ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. ఆ నంబర్ల ఆధారంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. ఇలాంటి అనేక సౌకర్యాలతో బీఎల్‌ఓలు చేపట్టే ప్రక్రియలు సులభంగా మారాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.


