ఇష్టానుసారంగా యూరియూ విక్రయాలు | - | Sakshi
Sakshi News home page

ఇష్టానుసారంగా యూరియూ విక్రయాలు

Jul 4 2026 2:07 AM | Updated on Jul 4 2026 2:07 AM

ఒక్కో బస్తాపై రూ.45

అదనపు వసూలు

డబ్బులు చెల్లించిన రశీదు

ఇవ్వని యజమాని

తిమ్మాజిపేట: మండలంలో పెస్టిసైడ్‌, ఫర్టిలైజర్‌ దుకాణ యజమానులు ఇష్టానుసారంగా ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమ దందాకు తెరలేపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో బస్తా యూరియా రూ. 266.60లకు విక్రయించాల్సి ఉండగా రూ.310లకు అమ్ముతున్నారు. ఒక్కో బస్తాపై అదనంగా రూ.45 వసూలు చేస్తున్నారు. మండలంలోని తుమ్మలకుంట తండాకు చెందిన రైతు వడ్తావత్‌ హుసేనీ గురువారం ఆన్‌లైన్‌లో యూరియూ బుక్‌ చేసుకున్నాడు. తిమ్మాజిపేటలోని యూరియా సరఫరా చేస్తున్న దుకాణం వద్దకు వెళ్లి మెసేజ్‌ చూయించి 6 యూరియా బస్తాలకు రూ.1860లకు కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు రూ.45 లు ఎందుకు అదనంగా తీసుకుంటున్నావని ప్రశ్నించగా రవాణా చార్జీలు, హమాలీ కూలి ఎవరిస్తారని దుకాణ యజమాని దురుసుగా సమాధానం చెప్పాడు. ఏఓకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అధికంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి రైతుకు వేసినట్లు సమాచారం.

ఎరువుల దుకాణాన్ని సీజ్‌ చేస్తాం

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే రైతులకు యూరియా విక్రయించాలి. అధిక ధరలు వసూలు చేస్తే ఎరువుల దుకాణాన్ని సీజ్‌ చేస్తామని ఏఓ కమల్‌కుమార్‌ హెచ్చరించారు. తిమ్మాజిపేటలో దుకాణందారులు అధిక ధరలు తీసుకుంటున్న విషయం తన దృష్టికి వచ్చింది. తనిఖీ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement