నూతన అధ్యాయానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

నూతన అధ్యాయానికి శ్రీకారం

Jul 3 2026 12:52 AM | Updated on Jul 3 2026 12:52 AM

ఏళ్లనాటి కల సాకారం

హాజరైన జడ్జి, ఎమ్మెల్యే, కలెక్టర్‌,

ఎస్పీ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

దేవరకద్రలో కోర్టును వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు జడ్జిలు

దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ న్యాయస్థాన భవనాన్ని తెలంగాణ హైకోర్టు జడ్జిలు శ్రావణ్‌కుమార్‌, మాధవిదేవి వర్చువల్‌ విధానంలో ప్రారంభించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. జిల్లా జడ్జి ప్రేమలత, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనందరావు, కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి కోర్టు భవనాన్ని, కోర్టులోని వివిధ విభాగాలను పూజలు చేసి ప్రారంభించారు.

ప్రజలకు అందుబాటులో న్యాయసేవలు

దేవరకద్రలో కోర్టు ఏర్పాటుతో ప్రజలకు న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని హైకోర్టు జడ్జిలు జస్టీస్‌ శ్రావణ్‌కుమార్‌, జస్టిస్‌ మాధవిదేవి తెలిపారు. దేవరకద్ర కోర్టును వర్చువల్‌గా ప్రారంభించిన తరువాత వారు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల ప్రయత్నంతో దేవరకద్రకు కోర్టు వచ్చిందన్నారు. దేవరకద్ర కోర్టు పరిధిలో అడ్డాకుల, మూసాపేట, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలకు సంబంధించిన కేసులు విచారణ చేయడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. కోర్టు సేవలను కక్షిదారులు వినియోగించుకుని సత్వర న్యాయం పొందవచ్చని తెలిపారు. దేవరకద్ర చుట్టుపక్కల ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, నిజాం కాలంలో నిర్మించిన కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు, ఆధ్యాత్మిక కేంద్రాలైన కురుమూర్తి, మన్యంకొండ ఆలయాలు ఉన్నాయని తెలిపారు.

సులభతర న్యాయసేవలే లక్ష్యం

ప్రజలకు సులభతర న్యాయసేవలు అందించడమే లక్ష్యమని జిల్లా సెషన్స్‌ జడ్జి ప్రేమలత పేర్కొన్నారు. నూతన కోర్టు ఏర్పాటుతో స్థానిక ప్రజలకు న్యాయసేవలు మరింత చేరువవుతాయన్నారు. కోర్టు అందుబాటులోకి రావడంతో పెండింగ్‌ కేసుల విచారణ ప్రక్రియ వేగవంతం కావడమే కాకుండా న్యాయవ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో సివిల్‌ కోర్టు ఏర్పాటు కావడం వెనక ఎన్నో ఏళ్ల ప్రజల ఆకాంక్ష ఉందని.. అది నేడు సాకారం కావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు ప్రారంభంతో ప్రజల ప్రయాణ సమయం ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతాయన్నారు. ప్రజలకు న్యాయం చేరువ చేయాలనే ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని, నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దమయంతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ హర్షద్‌, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement