విశ్వశక్తికి ప్రతీక శ్రీచక్రం..
శృంగేరి శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో మహోత్సవం
● ఐశ్వర్యం, ఆరోగ్యం శాంతిని ప్రసాదించే యంత్రరాజం
● ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రవచానాలు
అలంపూర్ రూరల్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం మరో విశిష్ట ఘట్టానికి వేదికై ంది. దేవిశక్తి రూపంగా భావించే శ్రీచక్ర యంత్ర ప్రాణప్రతిష్ఠ వేద పండితుల వేదోచ్ఛరణల మధ్య శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి అమృత హస్తాలతో గురువారం సింహలగ్న ముమూర్తంలో ఉదయం 10 గంటలకు వైభవంగా నిర్వహించారు. ఆలయ సాంప్రదాయ పద్ధతిలో ఈఓ దీప్తిరెడ్డి, ఆలయ అర్చకులు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేత్రపర్వంగా సాగిన క్రతువును వీక్షించేందుకు వచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయాల ప్రాంగణాలు కిక్కిరిపోయాయి.
ఆలయంలో ప్రమఖులు:
జోగుళాంబ ఆలయాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రాణి కుముదిని, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, జాయింట్ కలెక్టర్ నర్సింగరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, దేవదాయ శాఖ కమిష్‌నర్ హనుమంతరావు, డీఎస్పీ మొగిలయ్య, దేవదాయ శాఖ స్థపతి వల్లి నాయగం ఎపిటోమ్ ప్రాజెక్ట్ ఎండీ జైపాల్ కాంత, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
జోగుళాంబ సన్నిధిలో ప్రత్యేకంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖర భారతిస్వామి మాట్లాడుతూ.. జోగుళాంబ సన్నిధిలో శ్రీచక్ర ప్రాణప్రతిష్ఠ జరగడం భక్తుల అదృష్టమన్నారు. శ్రీచక్రం కేవలం యంత్రం కాదని.. అది ఒక దైవశక్తి, విశ్వ శక్తికి ప్రతీక అన్నారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆలయంలో ఆధ్యాత్మిక శక్తి, దైవ చైతన్యం, మరింతగా వృద్ధి చెందుతాయని, తద్వార భక్తులు ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి సౌభాగ్యం లభిస్తాయన్నారు. శ్రీ చక్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రం, శక్తివంతమైన యంత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుందన్నారు. ఇది దేవి సమగ్ర స్వరూపాన్ని సూచిస్తుందని, విశ్వం సృష్టి, స్థితి లయలను ప్రతిబింభిస్తుందని పేర్కొన్నారు. శ్రీచక్ర ఆరాధన ద్వారా భక్తుల మానసిక ప్రశాంతతను శారీరక ఆరోగ్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును పొందగలరని విశ్వసిస్తారన్నారు.


