నీటి పొదుపు చర్యలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నీటి పొదుపు చర్యలు పాటించాలి

Jul 3 2026 12:52 AM | Updated on Jul 3 2026 12:52 AM

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంటల సాగులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. శాస్త్రవేత్తలు డాక్టర్‌ కె.కళ్యాణి, డాక్టర్‌ కె.సదయ్య సోమవారం మిడ్జిల్‌ మండలంలోని వల్లభురావుపల్లి, పస్పుల, రాణిపేట, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సాగులో ఉన్న పత్తి, మొక్కజొన్న, మిరప, వంకాయ, మునగ పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పలు సూచనలు అందించారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగంలో పొదుపు చర్యలు చేపట్టాలని సూచించారు. నేల తేమను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పంటల పెరుగుదల దశను బట్టి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పచ్చిరొట్ట పంటల సాగు వల్ల భూసారం మెరుగుపడటంతో పాటు భూమిలో సేంద్రియ పదార్థాల శాతం పెరిగి భవిష్యత్‌లో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. అవసరానికి మించి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల వ్యయభారం పెరగడంతో పాటు నేల నాణ్యత దెబ్బతింటుందని, అందువల్ల శాసీ్త్రయ సూచనల మేరకే వాటిని వినియోగించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఏఈఓ గౌర్‌ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement